చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన ఓ మైనర్ రేప్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడ్ని పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా అని అడగడంతో.. దేశం మొత్తం అవాక్కయింది. విచారణ ధర్మాసనానికి సీజేఐ నేతృత్వం వహించడం.. స్వయంగా ఆయనే ఆ వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్త దుమారం రేగుతోంది. ఆయనకు సీజైఐ పోస్టులో ఉండే అర్హత లేదని తక్షణం వైదొలగాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని వివరిస్తూ.. దేశంలోని నాలుగు వేల మంది వివిధరంగాల ప్రముఖులు లేఖ రాశారు. పదవి నుంచి వైదొలగాలన్నారు.
సీజేఐపై వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు స్పందించింది. న్యాయరికార్డుల్లో ఉన్నదాన్ని మాత్రమే జస్టిస్ బోర్డే చదివారని.. దాన్ని వివాదం చేస్తున్నారని సుప్రీంకోర్టు స్పందించింది. అది కరెక్ట్ కాదన్నది. అయితే న్యాయరికార్డుల్లో ఉన్నది చదవడం కాదు.. ఆ ఉద్యోగికి ఆఫర్ ఇచ్చారని.. పెళ్లి చేసుకుంటే … తప్పు లేదన్నట్లుగా మాట్లాడటమే కాదు… ఆయనను అరెస్ట్ చేయకుండా నాలుగు వారాల పాటు రిలీఫ్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నా .. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేసే విషయంలో సుప్రీంకోర్టు సీజేఐ.. చట్ట ప్రకారం వ్యవహరించలేదని.. పోక్సో చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు మాత్రం అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
ఇప్పుడు సీజేఐకి వ్యతిరేకంగా నాలుగు వేల మంది ప్రముఖులు లేఖ రాస్తే.. రేపు ఆయనకు మద్దతుగా ఎనిమిది వేల మంది రాస్తారు. ఇదంతా దేశంలో జరుగుతున్న ప్రస్తుత ప్రక్రియ. దిశా రవి కేసులో జరిగింది అదే. ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా దేశద్రోహం కేసు పెట్టేశారు. ఆ సమయంలో ఆమెకు మద్దతుగా.. వ్యతిరేకంగా సీజేఐలకు లేఖలు రాసినఘటనలు ఉన్నాయి. దేశంలో ఓ రకమైన భిన్నమైన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం ఎదురుగా ఉన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వ్యవస్థలన్నీ ఒత్తిడిలో ఉన్నాయని అంటున్నారు. ఇది దేశానికి మంచిది కాదంటున్నారు.అయితే ఇలాంటి వారందరిపై దేశభక్తి పేరుతో ఎదురుదాడి జరుగుతూండటంతో చాలా మంది సైలెంటయిపోతున్నారు.