బెజవాడకు తానే హైకమాండ్ అని ప్రకటించుకున్న ఎంపీ కేశినేని నాని చివరకు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటున్నారు. తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. హైకమాండ్ ఆమోదముద్ర వేసేలా చూసుకున్నారు. తాను సూచించిన అభ్యర్థులనే రంగంలో ఉండేలా చూసుకున్నారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ లాంటి నేతలు అభ్యంతరం చెప్పిన అభ్యర్థులను సైతం తానే పట్టుబట్టి బీఫాంలు ఇప్పించుకున్నారు. చంద్రబాబు కూడా కేశినేనికే ఎన్నికల బాధ్యతలు ఇవ్వడంతో మిగతా వారు సైలెంటయ్యారు. టిక్కెట్లు ఇప్పించుకున్న తమ అనుచరులను గెలిపించుకోవడం కోసం తిరుగుతున్నారు.
కేశినేని శ్వేతను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేస్తూ టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. దీనికి ముందు అందర్నీ ఒప్పించింది. ఎవరేమనుకున్నా… కేశినేని నాని మాత్రం.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోతున్నారు. బెజవాడ కార్పొరేషన్ ను గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండింటిలో టీడీపీ ఓడిపోయింది. తూర్పు నియోజకవర్గంలో ఒక్క గద్దె రామ్మోహన్ మాత్రమే గెలిచారు. అయితే మూడు చోట్ల.. ఎంపీ స్థానంలో కేశినేని నానికి మెజార్టీ వచ్చింది.
దీంతో తనపై విజయవాడ ప్రజల్లో సానుకూలత ఉందని .. తన బలంతోనే గెలిచానని.. ఆయన వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. తన బలాన్ని నిజంగానే మేయర్ సీటు గెలిపించి చూపించాల్సిన పరిస్థితిలో కేశినేని పడ్డారు. ఈ చాలెంజ్ ను ఆయన తీసుకున్నారు. మరి ఫలితాలు సాధిస్తారో లేదో చూడాలి..!