ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి కూడా సమయానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఆ ఆలోచన ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంత వరకూ సంకేతాలు రాలేదు. ఇటీవల కేబినెట్ భేటీ జరిగినా అందులో సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించారు కానీ.. బడ్జెట్ గురించి ప్రస్తావించలేదు. అసెంబ్లీ సమావేశాల గురించి ప్రస్తావించలేదు. ఎప్పటి నుంచి జరపాలన్న ఆలోచన కూడా చేయలేదు. మరో వైపు తెలంగాణ సర్కార్ బడ్జెట్ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాలని.. ఎంత తక్కువైతే అంత పర్వాలేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ మాత్రం ప్రస్తుతం బడ్జెట్ లెక్కల గురించి పెద్దగా కసరత్తు చేస్తున్నట్లుగా లేదు.
సాధారణంగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశ పెడుతున్నారు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయ లెక్కలు ఆ బడ్జెట్‌తో తేలిపోతాయి. వాటిని ఆసరాగా చేసుకుని రాష్ట్రాలు తమ పద్దలను లెక్కలేసుకుంటాయి. ఇప్పుడు.. ఏపీకి వచ్చేది ఏంటో తేలిపోయింది. లెక్కలేసుకునే వెసులుబాటు వచ్చింది. అయినా ఈ సారి ఓటాన్ అకౌంటే పెట్టాలని… మూడు నెలల తర్వాత అసలు బడ్జెట్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి సాకుగా ఎన్నికలను చూపించే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కారణంగా బడ్జెట్ ను వాయిదా వేసుకుని మూడు నెలల పద్దులకు గవర్నర్ వద్ద నుంచి ఆమోదం పొంది బండి నడిపించేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సారి ఏపీ సర్కార్ కు బడ్జెట్ లెక్కలు కత్తి మీద సాములాంటివే. లోటు రూ. యాభైవేల కోట్లు దాటిపోయిన నేపధ్యంలో దాన్ని కవర్ చేస్తూ.. ఆదాయ, వ్యయాలకు పద్దులు చూపించాల్సి ఉంటుంది. గత ఏడాది రూ. నలభై మూడు వేల కోట్ల అప్పు అంచనాలను కాస్తా.. లక్ష కోట్లు దాటిపోయేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి చెల్లింపులు కూడా కీలకంగా మారాయి. జీత భత్యాలు, ఈ అప్పుల తిరిగి చెల్లింపుల కోసం కూడా… ఏపీకి వచ్చే ఆదాయం సరిపోనిపరిస్థితి ఉంది. ఇక పథకాలకు ఎలా సర్దుబాటు చేస్తారు.. రోజు వారీ ఖర్చులకు అభివృద్ధి పనులకు ఎలా నిధులు తెస్తారన్నది కీలకం. గత ఏడాది కూడా కరోనా కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశ పెట్టారు.