తెలుగు360 రేటింగ్ 2.5/5
స్పోర్ట్స్ సినిమాలు తెలుగు తెరకి కొత్త కాదు. మనందరికీ బాగా తెలిసిన క్రికెట్ మొదలుకొని… అంతగా పరిచయం లేని రగ్బీ వరకు ఆ ఆటని స్పృశిస్తూ సినిమాలు తీశారు, విజయాల్ని అందుకున్నారు. అయితే మన జాతీయ క్రీడ అయిన హాకీ నేపథ్యంలో మాత్రం తెలుగులో ఇంకా సినిమాలు రాలేదు. మన ప్రేక్షకులకు ఈ ఆట సరికొత్త వినోదాన్ని పంచుతుందని `ఏ1 ఎక్స్‌ప్రెస్` బృందం భావించినట్టుంది. కథానాయకుడు సందీప్ కిషన్ 25వ చిత్రమిది. మరి సందీప్ ఆడిన ఈ ఆట ఎలా ఉంది?
హాకీ అంటే ఏమిటో తెలియనోడికి ఉన్నట్టుండి హాకీ స్టిక్ ఇచ్చేసి గ్రౌండ్లో దింపేస్తే ఎలా ఉంటుంది? సంజూ అలియాస్ సందీప్ నాయుడు (సందీప్‌కిషన్)కి కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. మామ ఊరు యానాం వెళ్లిన సంజూ… లావణ్య (లావణ్య త్రిపాఠి)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె హాకీ క్రీడాకారిణి. లావణ్య కోసమే సంజూ హాకీ గ్రౌండ్లోకి దిగాల్సి వస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో అతను గ్రౌండ్లోకి దిగాక అదరగొడతాడు. ఆ తర్వాత అతని గురించి అసలు విషయం తెలుస్తుంది. ఇంతకీ సంజూ ఎవరు? అతనికీ, హాకీకీ ఉన్న సంబంధం ఏమిటి? యానాంలో ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్ కోసం సంజూ ఏం చేశాడు? ఆ గ్రౌండ్ కోసం సంజూ ఆడిన ఆట ఎన్ని మలుపులు తిరిగింది? తదితర విషయాలే సినిమా.
ఈ సినిమాలో ఆట మారిందే కానీ… రాజకీయాలు మాత్రం మారలేదు. క్రీడా నేపథ్యంలో సాగే సినిమాలంటే ఎక్కువగా ఆటల్లో రాజకీయాల నేపథ్యంలోనే సాగుతుంటాయి. ఇది కూడా ఆ తాను ముక్కే. కథ, కథనాల పరంగా చూస్తే ఎలాంటి కొత్తదనం లేదు. మన కథానాయకుడు హాకీ స్టిక్ పట్టుకోవడంలో మాత్రమే కొత్తదనం వెదుక్కోవాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రతిభని తొక్కేస్తూ సాగే రాజకీయం, మిగతా కథలో రాజకీయ నాయకుల స్వలాభం కోసం మైదానంతో వ్యాపారం చేయడం… ఇలా రెండు కోణాల్లో ఈ కథ సాగుతుంది. కథానాయకుడు తన ఆటతోనే ఎత్తులు వేస్తూ అనుకున్నది సాధిస్తాడు. సగటు క్రీడా నేపథ్యంలో సాగే సినిమాల్లో ఎలాంటి అంశాలుంటాయో ఇందులో కూడా అంతే. అయితే అసలు విరామ సమయానికి కానీ ఈ సినిమా అసలు కథలోకి వెళ్లదు. అప్పటివరకు టైమ్ పాస్ వ్యవహారమే. ఫస్ట్ హాఫ్‌లో చిట్టిబాబు గ్రౌండ్‌ని పరిచయం చేసిన దర్శకుడు… ఆ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య సీక్వెన్స్‌తోనే కాలయాపన చేశాడు. ఆ సన్నివేశాలతో వినోదం ఏమైనా పండిందా అంటే అదీ లేదు. కమర్షియాలిటీ కోసమే అన్నట్టుగా రెండు మూడు పాటలు, ముద్దు సన్నివేశంతో ఫస్ట్‌హాఫ్‌ని ముడిపెట్టేశాడు.
ద్వితీయార్థంలోనే కథంతా ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడి ప్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. అయితే అందులో భావోద్వేగాలు అంతగా పండలేదు. ఇలాంటి కథలకి ముగింపుని ఆటతోనే ముడిపెడుతుంటారు. ఇందులో కూడా అంతే. ఆ ఆట కూడా అంతంత మాత్రమే రక్తికట్టింది. మరీ సినిమాటిక్‌గా అనిపించే ఆ సన్నివేశాల్లో సహజత్వం ఎక్కడా కనిపించదు. తమిళంలో విజయవంతమైన `నట్పే తునై`కి రీమేక్ ఇది. ఒక కథని రీమేక్ చేస్తున్నప్పుడు అప్పటికే ఉన్న మైనస్‌లని కూడా ప్లస్సులుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ సినిమాలో మరిన్ని మైనస్సులే కనిపిస్తాయి కానీ… ప్లస్సులు తక్కువే. అక్కడక్కడా కొన్ని సీక్వెన్సులు మాత్రమే మెప్పిస్తాయి. `ఎ1 ఎక్స్‌ప్రెస్` అనే పేరుకీ, ఈ కథకీ సంబంధమే లేదు.
నటీనటుల్లో సందీప్కిషన్కే ఎక్కువ మార్కులు పడతాయి. అయితే ఆయన భావోద్వేగాల్ని పండించే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సినిమా గట్టిగా చెబుతుంది. సిక్స్‌ప్యాక్‌తో సందడి చేసిన సందీప్‌కిషన్ హాకీ క్రీడాకారుడిగా కనిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. రావు రమేష్ పాత్ర ఈ సినిమాకి కీలకం. ఆయన తలపండిన రాజకీయ నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. లావణ్య త్రిపాఠి కొన్ని సన్నివేశాలకే పరిమితం. మురళీశర్మ, సత్య, మహేష్ విట్టా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సంగీతం మినహా మిగతా విభాగాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. దర్శకుడు డెన్నిస్ అనుభవం ఈ సినిమాకి చాలలేదు. కొన్ని సన్నివేశాలపై మాత్రం ఆయన ప్రభావం చూపించారు.
పేరుకే ఎ1 ఎక్స్‌ప్రెస్ కానీ… సినిమాలో మాత్రం ఆ జోరు ఎక్కడా కనిపించదు. హీరో ఎలివేషన్ కోసం, కమర్షియాలిటీ కోసం కావల్సిననన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కానీ, కథ కథనాల విషయాలపై మాత్రం అంతగా దృష్టిపెట్టలేదు. దాంతో ఈ ఆట టైమ్‌పాస్ వ్యవహారంలా మారిపోయింది.
ఫినిషింగ్ టచ్: పట్టాలు తప్పింది
తెలుగు360 రేటింగ్ 2.5/5