అపరిమితమైన అప్పులు చేసి.. లోటును మూడు వందల శాతానికి పెంచిన తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతుండటంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అప్పులు ఎక్కువగా తీసుకు రావడానికి కారణం కరోనానే అని వాదించారు. కరోనా వల్ల ఆదాయం పడిపోయిందని.. అయినప్పటికీ.. సంక్షేమ పథకాలు ఆపలేదని… అందు కోసమే అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే బుగ్గన వాదన.. తేలిపోయింది. ఇదే ప్రెస్మీట్లో ఆయన అప్పులు చేయాల్సి వచ్చింది అన్న దాన్ని సమర్థించుకోవడం కోసం ఆదాయం పడిపోయిందన్నారు. కానీ.. తాము అభివృద్ధి చేశామని చెప్పుకోవాల్సినప్పుడు ఆదాయం పెరిగిందని లెక్కలు చెప్పారు. దీంతో ఒకే ప్రెస్మీట్లో ఆదాయం తగ్గిందని.. ఆదాయం పెరిగిందని రెండు రకాలుగా బుగ్గన వాదనలు వినిపించి.. అయోమయం సృష్టించారు.
ఆదాయం పెరిగినా తగ్గిందని వాదించిన బుగ్గన..!
ఇటీవలి కాలంలో పెద్దగా మీడియాతో మాట్లాడని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాగ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత.. ఏపీ ఆర్థిక నిర్వహణ తీసికట్టుగా ఉందని నిపుణులు కూడా తేల్చేయడం.. దివాలా అంచున ఉందని.. విశ్లేషణలు రావడంతో విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కోవిడ్ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందన్నారు. రాబడి లేకపోవటడం వల్ల అప్పులు పెరగటం సహజమని, రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. అదే సమయంలో ఆయన చెప్పిన లెక్కలు మాత్రం ఆదాయం పెంపుదలను సూచించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం జూన్లో రెవెన్యూ రాబడి రూ. 3,540 కోట్లు ఉంటే 2020-21 జూన్లో రెవెన్యూ రాబడి రూ. 5,781 కోట్లు పెరిగిందని చెప్పారు. జీఎస్టీ పన్నుల రాబడిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని బుగ్గన చెప్పుకొచ్చారు. రూ. రెండు వేల రెండు వందల కోట్లు ఎక్కువే అయినా ఆదాయం పడిపోయినందుకే అప్పులు అని బుగ్గన చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఆదాయం తగ్గిందంటూనే పెరిగిందని లెక్కలు చెప్పిన బుగ్గన..!
తీసుకొచ్చిన అప్పును సంపద సృష్టించడానికి ఖర్చు పెట్టలేదని సంక్షేమానికే ఖర్చు పెట్టామని అంగీకరించారు. అయితే.. తాము అప్పు తీసుకు వచ్చి ప్రజలకు పంచడం ద్వారా మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవశపెట్టామనే వాదన తీసుకొచ్చారు. అదే సమయంలో.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష కోట్లకుపైగా అప్పులు చేస్తోంది. అయితే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయనంత అప్పు ఒక్క ఏడాదిలోనే చేస్తున్నా… గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని విమర్శించేశారు.
గత ప్రభుత్వాన్ని నిందిస్తే తమ అప్పులు ఒప్పులవుతాయా..?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇదే మాదిరిగా ఉంటే.. ప్రజలపై మరింతగా పన్నుల భారం మోపి .. రోజువారీ అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో … వివిధ పన్నులు పెంచేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలు వేయడం… చాలా మందిని అదే నిజం అనిపించేలా చేస్తోంది. స్టాంప్ డ్యూటీ మీద రూ. 250 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చేలా పన్ను విధించడానికి ఏపీ సర్కార్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. బుగ్గన రాజకీయ జిమ్మిక్కులతో ఏదేదో చెబితే.. రాష్ట్రానికి మంచి జరగదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా తన ఆర్థిక నైపుణ్యాన్ని చూపించాలని విపక్ష నేతలంటున్నారు.