ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మరింత ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది. సిరీస్‌ను భారత్ 3-1 తో కైవసం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేయగా… ఇంగ్లండ్ 205 పరుగులు చేసింది , రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. చెరో 5 వికెట్లు తీసిన అశ్విన్, అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. క్లిష్టతరమైన పిచ్‌పై భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మంచి పరిణితి కనబరిచారు. రిషబ్ పంత్ తన విధిని నిర్వహించగా.. వాషింగ్టన్ సుందర్.. అత్యంత విలువైన పరుగుల్ని జోడించారు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో. అహ్మదాబాద్ పిచ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నాలుగో టెస్ట్ కూడా అక్కడే జరుగింది. అయితే పిచ్ ను మార్పు చేశారు. బ్యాటింగ్ పిచ్ అని మొదట్లో ప్రచారం జరిగినా… తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్‌కు పిచ్ అర్థం కాలేదు. బోల్తా కొట్టారు.
గజరాత్కు చెందిన బౌలర్ అక్షర్ పటేల్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత్ వేగంగా పుంజుకుంది. వరుసగా మూడు టెస్టులు గెలిచి సిరీస్ అందుకుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది. లార్డ్స్‌లో కూడా గెలిస్తే… చరిత్ర సృష్టించినట్లవుతుంది.