ఖమ్మం జిల్లాలో వైఎస్ విగ్రహాల ధ్వంసం అంటూ షర్మిల పార్టీకి చెందిన కొంత మంది నేతలు రెండు రోజుల నుంచి హడావుడి చేస్తున్నారు. వైఎస్ అభిమానుల సెంటిమెంట్ దెబ్బ తీస్తున్నారని … అందరం కలిసి చలో ఖమ్మంకు పిలునిపిస్తామని పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి లాంటి మాజీ వైసీపీ నేతలు ప్రస్తుతం.. షర్మిల పెట్టబోయే పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్‌గా వ్యవహరిస్తున్న నేతలు అంటున్నారు. వారే ఎక్కడెక్కడ విగ్రహాలు ధ్వంసం అయ్యాయో.. వివరిస్తూ..వీడియోలు మీడియాకు పంపుతున్నారు. తమ వాళ్లు ధర్నా చేసిన దృశ్యాలు కూడా వారే సర్క్యూలేట్ చేస్తున్నారు.
అటు విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో తెలియదు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదు.. ఎప్పుడో పెట్టిన విగ్రహాలు ఇప్పటికే ధ్వంసం అయ్యాయో లేదో కూడా తెలియదు.. హఠాత్తుగా షర్మిల పార్టీ నేతలు విగ్రహాల ధ్వంసం రాజకీయాన్ని తెరపైకి తేవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదంతా ఓల్డ్ మోడల్ రాజకీయాలు లాగా ఉన్నాయని కామెడీ చేయడం ప్రారంభించారు. షర్మిల వచ్చే నెల తొమ్మిదో తేదీన ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ బహిరంగసభ పెట్టి పార్టీ ప్రకటన చేయాలనుకుంటున్నారు. లోటస్ పాండ్ వద్ద.. రోజూ హడావుడి ఉండేలా చూసుకుంటున్నా… పార్టీకి పెద్దగా హైప్ కనిపించడం లేదు. లోటస్ పాండ్‌కు వచ్చే వారిలో.. ఒకరిద్దరు చేసిన ఓవరాక్షన్‌తో… డ్రామా పార్టీగా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఇలాంటి సమయంలో… ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో విగ్రహాలను కూలుస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు.. దూకుడుగా చేతులు విరిచేస్తాం.. కాళ్లు నరికేస్తాం.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి.. పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూండటంతో ఇదంతా తేడాగా ఉందన్న అభిప్రాయం ఏర్పడిపోతోంది. చివరికి.. వైఎస్ షర్మిల కూడా.. విగ్రహాల ధ్వంసంపై స్పందించారు. ఏపీలో అయితే.. ఇలాంటివి నడుస్తాయేమో కానీ.. తెలంగాణలో నడిచే అవకాశం లేదని… షర్మిల పార్టీకి ప్రజల్లో క్రేజ్ రావాలంటే భిన్నమైన మార్గం ఎంచుకోవాలన్న సలహాలు ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్నాయి.