తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా… టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ ఉందని చెప్పుకోవడానికి ఆ రెండు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శలు చేస్తూంటారు. ఈ వ్యూహంతో కాంగ్రెస్ సైడ్‌కి వెళ్లిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం రావాలని కేటీఆర్‌కు సవాల్ చేస్తున్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే శరీరాలే వేరని.. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ.. ఏడేళ్లుగా చేస్తున్నారని మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బీజేపీపై యుద్ధమన్నారు.. తర్వాత ఢిల్లీ వెళ్లి రాజీ పడ్డారని ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీపై యుద్ధం అంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటి కాకపోతే ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్షకు మీరు సిద్ధమా అని సవాల్ చేశారు. దీక్షతో మోదీపై ఒత్తిడి పెంచుదాం వస్తారా అని సూటిగా ప్రశ్నించారు. నా సవాల్‌కు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయొద్దని కేటీఆర్‌కు సలహా ఇచ్చారు.
తన సవాల్‌ను స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా,.. శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని రేవంత్‌రెడ్డి తేల్చేశారు. రేవంత్ సవాళ్లపై … టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో స్పందించడం లేదు. బీజేపీ నేతలు ఏమన్నా.. ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నారు. రెండు పార్టీల మధ్య పోరాటం జరుగుతోందన్న భావన కల్పించగలుగుతున్నారు. వారిద్దరూ ఒక్కటేనని.. రేవంత్ రెడ్డి.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తుందో వేచి చూడాల్సిందే..!