మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది సారంగదరియా పాట. లవ్ స్టోరీ పేరిట శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొన్నీమధ్య ఈ సినిమాలోని సారంగదరియా పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. మంగ్లీ గాయని గా వచ్చిన ఈ పాట కి సాయిపల్లవి స్టెప్పులు అభినయం తోడవడంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఈ పాట ఊపేస్తోంది. అయితే ఈ పాట క్రెడిట్ కోసం- ముందు సోషల్ మీడియాలో, ఇప్పుడు తాజాగా ప్రధాన మీడియాలో ఆరోపణలు చేస్తూ కొందరు జానపద గాయనిలు తెర మీదకు వచ్చి ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
పాట నేపథ్యం:
ప్రోమో లో ఈ పాట రచన సుద్దాల అశోక్ తేజ అని ప్రకటించారు కానీ నిజానికి ఇది జానపదంలో ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న పాట. జనాల నోళ్ళలో ఎప్పటినుండో నానుతున్న ఈ పాటని అప్పట్లో రేలా రే రేలా అనే మాటీవీ ప్రోగ్రాం లో కోమలి అనే గాయని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ కి జడ్జిగా సుద్దాల అశోక్ తేజ ఉన్నారు. ఆయన ఆవిడను ఎంతగానో మెచ్చుకున్నారు . ఇకపై తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సారంగధరియా పాట వినిపించినా కోమలి యే జనాలకు గుర్తు వస్తుంది అంటూ ప్రశంసించారు. రేలారే రేలా ప్రోగ్రాం అయిన తర్వాత కోమలి మాట్లాడుతూ ఈ పాట తనకు తన నానమ్మ ఇచ్చిందని, జనబాహుళ్యంలో ఉన్న ఈ పాటని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు మరొకసారి చేరవేసేందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆవిడ ఆ పాటను పెట్టగా 2 మిలియన్లకు పైగా ఆ పాటకు వ్యూస్ వచ్చాయి. లవ్ స్టోరీ కంటే ముందే అనగనగా ఒక చిత్రం అనే సినిమాలో కూడా ఈ పాటను కొన్నేళ్ల క్రితం వాడుకున్నారు
తాజా వివాదం, జానపద గాయని కోమలి అభ్యంతరం:
ఇప్పుడు మంగ్లీ పాడిన పాట సూపర్ హిట్ అయింది. అయితే ఈ పాట రచన సుద్దాల అశోక్ తేజ అని ఎలా వేస్తారు అని, పాటను సేకరించిన వ్యక్తిగా తన పేరు సినిమా లో ఉండాలని కోమలి అభ్యంతర పెడుతున్నారు. పైగా ఈ పాట తాను కొన్నేళ్ళ క్రితం మా టీవీలో పాడినప్పుడు ఎంతగానో మెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజ, సినిమాలో ఈ పాట పాడడానికి తనకే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. తనను ఎవరూ ఈ పాట విషయంలో సంప్రదించలేదని, పాట విడుదలైన తర్వాత తానే ఇతరుల ద్వారా సుద్దాల అశోక్ తేజ ఫోన్ నంబర్ సంపాదించి ఆయనకు ఫోన్ చేశానని, ఆయన – ఈ పాట నీవు వ్రాసింది కూడా కాదు కాబట్టి నీ పేరు వేయడం సాధ్యం కాదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీ పాడిన పాటలో ఫోక్ సాంగ్ లో ఉండే పల్లె వాసన మిస్ అయిందని అందువల్ల మంగ్లీ పాడిన పాట తనకు నచ్చలేదని కూడా కోమలి వ్యాఖ్యానించారు.
సుద్దాల అశోక్ తేజ వెర్షన్:
అయితే సుద్దాల అశోక్ తేజ వెర్షన్ మరోలా ఉంది. ఈ పాట కోమలి ద్వారా ప్రాచుర్యం పొందక ముందే తన వద్ద కూడా ఉందని సుద్దాల అశోక్ తేజ అంటున్నారు. కోమలి పాడిన తర్వాత ప్రాచుర్యం పొందినప్పటికీ ఆ పాట పై ఆవిడకు ఎటువంటి హక్కులు ఉండవని ఆయన అంటున్నారు. అయితే పాటను పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా వాడుకోకుండా చరణాలలో సాహిత్యం మార్చి రాసిన కారణంగా రచన అని తన పేరు వేసుకోవడం సమంజసమే అని ఆయన వాదిస్తున్నారు. ఇక పాట ని ఎవరితో పాడించాలి అన్నది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుందని, సినిమా అనేది చాలా పెద్ద వ్యవహారం అని, కొన్ని నిర్ణయాలు పరిస్థితులను బట్టి దర్శకుడు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరణ ఇస్తున్నారు.
మధ్యలో మరొక జానపద గాయని శిరీష వివాదం:
ఇదిలా కొనసాగుతుంటే శిరీష అనే మరొక గాయని, ఈ పాటనే కోమలి కంటే ముందే తాను పాడానని వ్యాఖ్యలు చేయడంతో కాసేపు ఈ గొడవ కోమలి వర్సెస్ శిరీష గా మారింది. అయితే ఆ తర్వాత కోమలి సేకరించిన పాటే , ఒక టీవీ ప్రోగ్రాం నిర్వాహకుల ద్వారా శిరీష వద్దకు చేరిందని నిరూపణ కావడంతో శిరీష వెనక్కు తగ్గింది.
సేకరించిన వారి పేరు వేయడానికి సినీ పెద్దలకు ఎప్పుడూ అభ్యంతరమే:
జనబాహుళ్యంలో ఉన్న పాటలను తీసుకునేటప్పుడు, ఆ ఒరిజినల్ సృష్టించిన వారిని, లేదా మూల సృష్టికర్తలు తెలియనప్పుడు దాన్ని ప్రజాబాహుళ్యం లోనికి తీసుకు వచ్చిన వారిని సముచితంగా గౌరవించవలసి ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే సినీ పెద్దలు, ఎంతో ఖ్యాతి ని ఇది వరకే గడించిన సినీ పెద్దలు, ఎక్కడో మారుమూల పల్లెలో ఉంటూ పాటను సృష్టించడం లేదా ప్రజా బాహుళ్యం లోకి తీసుకురావడం చేస్తున్నవారికి – ఒక్క శాతం క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడతారు అన్నది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. పేరొందిన గీత రచయితలు, గాయనీ గాయకులు తీసుకునే పారితోషికంలో 10 శాతం వీరికి ఇచ్చి, తెర మీద ఒక మూల చిన్న పేరు వేస్తే వారు జీవితాంతం ఆ అనుభవాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా, ఆ పాటకు సంబంధించి ఎటువంటి వివాదము చేయరు, పైగా ఈ పాటను ప్రమోట్ చేయడానికి కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. అయినప్పటికీ ఎందుకు సినీ పెద్దలు ఆ కొద్ది శాతం పారితోషికం, చిన్న క్రెడిట్ ఇవ్వడానికి ఇంతగా గింజుకుంటారు అన్నది ప్రేక్షకులకు అర్ధం కాని ప్రశ్న.
మొత్తం మీద:
శేఖర్ కమ్ముల ఇదివరకే ట్వీట్ ద్వారా కోమలి కి కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, అది సరిపోదు. తెలుగు సినీ పరిశ్రమలో భావ చౌర్యం క్రెడిట్ కొట్టడం వంటి జాడ్యాలు మిగతా వారి వద్ద ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల వద్ద ఇలాంటివి సహజంగా కనిపించవు. కానీ ఈసారి మాత్రం బహుశా సుద్దాల అశోక్ తేజ కారణంగా ఈ వివాదం ఇక్కడ వరకు వచ్చింది. శేఖర్ కమ్ముల వంటివారు చొరవ తీసుకుని వివాదానికి సముచితమైన రీతిలో ముగింపు పలికితే, రాబోయే రోజుల్లో జానపద గీతాలను సినిమా లో వినియోగించుకునేటప్పుడు ఆయా కళాకారులను తగురీతిలో గౌరవించుకునే విషయంలో మిగతా దర్శక నిర్మాతలు రచయితలు కూడా ఆయన ఏర్పాటు చేసే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది.
– ZURAN