జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై జంకూ గొంకూ లేకుండా విరుచుకుపడుతున్నారు. అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీలో పోరాడకుండా గల్లీలో ఆడుతున్న డ్రామాలను నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లకపోయినా.. తన వాదనను రోజూ వీడియోల ద్వారా విడుదల చేస్తున్నారు. దాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారు. పవన్ కల్యాణ్ మాత్రమే విమర్శిస్తున్నారు. జనసేన మాత్రమే దూకుడుగా వైసీపీ పై పోరాడుతోంది. అదే సమయంలో జనసేనకు మిత్రపక్షంగా ఉన్న… పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉండిపోతోంది. ఇక్కడే వాయిస్ కంబైన్డ్‌గా ప్రజల్లోకి వెళ్లడం లేదు.
విపక్షాన్ని టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయం చేస్తున్న బీజేపీ..!
భారతీయ జనతా పార్టీ నేతలకు తమకు అలవాటైన రాజకీయాన్ని చాలా చురుగ్గా చేసేస్తూంటారు. అధికార పార్టీ పేరుతో ప్రతిపక్షాన్ని విమర్శించేస్తూంటారు. వైసీపీ విధానాలను ప్రశ్నించాలి కానీ.. పైపైన సుతిమెత్తగా.. విమర్శలు చేసేసి.. టీడీపీపైకి వచ్చేస్తారు బీజేపీ నేతలు.ఆయన స్ట్రాటజీనే ఇతర నేతలు ఫాలో అవుతారు. ఎవరైనా బీజేపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టారంటే.. ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే.. ముందుగా చంద్రబాబును.. చంద్రబాబు పాలనను.. టీడీపీని విమర్శించి…ఆ తర్వాత వైసీపీ పాలన దగ్గరకు వస్తారు.. ప్రతిపక్షం అంటే అధికారపక్షంతో పోరాడాలి. అలా కాకుండా… ప్రతిపక్షంతో పోరాడితే.. అధికార పార్టీకి మిత్రపక్షం అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ విషయంలో అదే జరుగుతోంది. ఏపీలో అధ్యక్ష పదవి మార్పు తర్వాత .. బీజేపీలో కొన్ని గొంతులు మూగబోయాయి. ప్రభుత్వంపై విరుచుకుపడే కొంత మంది వ్యక్తుల్ని సైలెంట్ చేసేశారు. ఓ ముగ్గురు, నలుగురు మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడేదే బీజేపీ విధానం. దాంతో.. వారి తీరు వల్ల బీజేపీ.. వైసీపీకి మిత్రపక్షం అనే ముద్రపడిపోతోంది.
బీజేపీ తీరుతో జనసేన బాట వేరని చెప్పుకునే యత్నంలో పవన్..!
వైపు జనసేన పార్టీ మాత్రం.. ఇలాంటి విషయాల్లో బీజేపీ నేత తనపై పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. బీజేపీలో వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వారితో కలిసి స్టేజ్‌లు పంచుకోవడం వంటివి చేయడం లేదు. జనసేన స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా.. సందర్భం వస్తే తప్ప.. బీజేపీతో తమ పొత్తు గురించి ప్రస్తావించడం లేదు. కలిసి పోటీ చేస్తున్నామన్న విషయాన్ని చాలా లో ప్రోఫైల్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొక్కుబడిగా బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. అంతే కాదు.. బీజేపీ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి … ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరణ ఇస్తున్నారు. ఏపీ కోసం… రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్నారు.
విశ్వసనీయత లేని పొత్తులతో లాభమేంటి..?
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై వపన్ కల్యాణ్ మొదటి నుంచి అసహనంతో ఉన్నారని జనసేన వర్గాలు కొన్నాళ్లుగా చెబుతున్నాయి. తిరుపతి ఉపఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్ ను కించ పరిచేలా ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేశారు. అదే సమయంలో పొత్తు ధర్మం పాటించకుండా… బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీపై పోరాడాల్సిన పరిస్థితిలో… మిత్రపక్షం అన్నట్లుగా ప్రజల్లో ముద్రపడేలా వ్యవహరిస్తున్నారు. వీరందరి తీరుపై… బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే ఇది అంతర్గత విషయం. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న రాజకీయం విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ అంత సంతృప్తిగా లేరనే మాట మాత్రం నిజమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. సొంత ఎజెండాతో రాజకీయాలు చేసుకుంటే.. ఆ పొత్తుల్లో విశ్వసనీయత.. నమ్మకం ఉండవు. అలాంటివి ఎక్కువ కాలం నిలబడవు. స్థానిక ఎన్నికల్లో.. జనసేన స్థానిక నాయకత్వం బీజేపీతో కన్నా టీడీపీతో నడవడానికి ఆసక్తి చూపించింది…అంటేనే వారి పొత్తులో నమ్మకం లేదని తేలిపోతుంది.