విరాటపర్వం… ఈ సినిమా పేరు చెప్పగానే ఓ ప్రేమకథో, ఓ విప్లవ గాథో, ఓ అభ్యుదయ చిత్రమో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్రయత్నమో… అనిపిస్తోంది. పోస్టర్లూ అలానే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ద్వారా మహిళా శక్తిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఈ చిత్రంలో కీలకమైన ఘట్టాల ద్వారా, సంభాషణల ద్వారా మహిళా శక్తిని, వాళ్ల ఆలోచనా విధానాన్నీ, వాళ్ల విశిష్టతనూ చాటి చెప్పబోతున్నార్ట. ముఖ్యంగా సాయి పల్లవి, ప్రియమణి, నందితాదాస్ పాత్రలు తీర్చిదిద్దిన విధానం – స్త్రీ చైతన్యానికీ వాళ్ల ఆలోచనా విధానానికీ తార్కాణంగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈరోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఓ డైలాగ్ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
చరిత్రలో దాగిన కథలకు తెర లేపిన ప్రేమ తనది
ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది
మహా సంక్షోభమే గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం ఆమెది.
అడవి బాట పట్టిన అనేకమంది వీరుల తల్లులకు వీళ్లు ప్రతిరూపాలు
వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం..
అంటూ రానా గొంతుతో.. వీళ్లకు సెట్యూట్ చెప్పారు. ఈ పాత్రలు `విరాటపర్వం` కథకు ప్రేరణలు, పునాదులు. మరి.. ఆయా పాత్రల్ని వెండి తెరపైకి తీసుకొచ్చి, ఓ అందమైన ప్రేమకథలో ఎలా ఇమిడ్చారో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాలి.