విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు… ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు ఇప్పిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
ఏపీ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదన్న ఆర్థిక మంత్రి.. అన్ని విషయాలు ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్తున్నామని… అవసరం అయిన సమయంలో ఏపీ ప్రభుత్వ మద్దతు తీసుకుంటామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఏపీ అధికార పార్టీ వైసీపీ చెబుతోంది. విశాఖలో పాదయాత్రలు చేస్తున్నారు. బంద్‌లకు పిలుపునిస్తే ఆ పార్టీ నేతలు తామే ముందుండి హడావుడి చేస్తున్నారు. కానీ.. ఢిల్లీలో మాత్రం నోరు మెదపడంలేదు. పైగా… కేంద్రం నుంచి.. ప్రైవేటీకరణ తప్పదని.. ఏపీ సర్కార్‌కు సంబంధం లేదనే సమాధానాలు వచ్చేలా ప్రశ్నలు వేస్తున్నారు. ప్రైవేటీకరణ విషయంలో ఏపీ సర్కార్ కు ప్రతీ విషయం తెలుసని కేంద్రం చెబుతోంది.
అయినప్పటికీ.. ఏపీ అధికార పార్టీ మాత్రం భిన్నమైన రాజకీయాలను చేస్తోంది. స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయ పార్టీలన్నీ రాజకీయమే చేస్తూండటంతో.. కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. అధికారంలో ఉన్న పార్టీలు బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ప్రజల్ని మభ్య పెట్టే రాజకీయం చేస్తే చాలనుకుంటున్నారు. అదే విశాఖ ఉక్కు పాలిట శాపంగా మారుతోంది. ప్రైవేటుకు మారిన తర్వాత ప్లాంట్ ఉంటుందో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అందుకే ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.