వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు, బాధ్యతలు మోస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చేంతగా..!. అంతకు ముందే సజ్జల ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబు పై విమర్శలు చేశారు. కాసేపటికే మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. మిన్నువిరిగి మీద పడినట్లుగా ఆయన అందులో ఆవేశ పడిపోయారు.
వైసీపీలో తిరుగుబాటు అని రిపబ్లిక్ టీవీ కథనం..!
ఇది పూర్తిగా రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనాన్ని ఖండించడానికే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతతో పాటు మరికొంత మంది ఎంపీలు.. తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నారని రిపబ్లిక్ టీవీ కథనం. దీన్ని సజ్జల ఖండానుఖండాలుగా తన ప్రెస్మీట్లో ఖండించారు. పనిలో పనిగా ఆర్నాబ్‌ను తిట్టిపోశారు. అలవాటయిన వ్యూహం… ఏం జరిగినా అనుసరించే పక్కా వ్యూహం.. చంద్రబాబుకు లింక్ పెట్టడం. అది కూడా చేసేశారు. చంద్రబాబు చెబితే కథనం వేశారన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు.. జర్నలిజం పాఠాలు కూడా ఆర్నాబ్‌కు చెప్పారు. ఎలాంటి కథనాలు వేయాలో కూడా ఆర్నాబ్‌కు సూచించారు. ఎలాంటి కథనాలు వేయాలంటే.. టీడీపీలో అలాంటి రివోల్ట్ వస్తోందని వేయాలట. వైసీపీలో వచ్చిందని వేయకూడదట. అలా వేస్తే జర్నలిజం భ్రష్టుపోయినట్లేననని.. సజ్జల వాదన.
నిప్పులేనిదే పొగ రాదు..! సజ్జల కంగారులో అదే ఉందా..!?
సరే.. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారనేదానికి ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ.. తమ పార్టీలో సూపర్ కామ్‌గా ఉందని… మీరే చూస్తున్నారుగా అని అని కవర్ చేసుకున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీల్లో జరిగే అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఆఫీసుల్లో జరగవు. బయటపడేదేకా.. సైలెంట్‌గానే ఉంటాయి. అయితే వైసీపీలో ఇప్పటికిప్పుడు జగన్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు తిరగబడే అవకాశం లేదనేది రాజకీయవర్గాల గట్టి అంచనా. అయితే.. చాన్స్ మాత్రం ఉందనేది వారి మాట. వారికి బీజేపీ సపోర్ట్ గనుక ఉంటే… నిజంగానే అసంతృప్తితో ఉన్న సీనియర్లు ధైర్యం చేస్తే.. రిపబ్లిక్ టీవీ చెప్పినట్లు రివోల్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
రిపబ్లిక్ టీవీ అంటే బీజేపీ..! బీజేపీ రాజకీయం ప్రారంభించిందా..?
బీజేపీ అలాంటివి చాలా చేయగలదు. అదే సమయంలో రిపబ్లిక్ టీవీ అంటే.. బీజేపీ మౌత్ పీస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా రిపబ్లిక్ టీవీ కూడా.. ఏదో విషయం లేకుండా.. ఉత్తినే వైసీపీని టార్గెట్ చేయదు కదా అనేది చాలా మంది సందేహం. ఎందుకంటే.. వైసీపీ బీజేపీతో సన్నిహితంగానే ఉంటుంది మరి..!. రిపబ్లిక్ టీవీ నాలుగు రోజుల కిందట..జగన్‌కు అత్యంత సన్నిహితులైన కొంత మంది విదేశీ ఆర్థిక లావాదేవీల్లో దొరికిపోయారని.. వారిపై విదేశాల నుంచి ఫిర్యాదులొచ్చాయని .. దర్యాప్తు జరుగుతోందని చెప్పింది. ఇప్పుడు.. రెండోది. వీటి వెనుక అసలు విషయం బ్లాస్ట్ అవడానికి ఇంకొంత కాలం పట్టే చాన్స్ ఉంది.