తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే… పరిస్థితిని బట్టి విచారణ జరుపుతారు. లేదంటే కోర్టు ఆదేశిస్తే సీబీఐ విచారణ జరుపుతుంది. అంతే కానీ.. రాష్ట్రాల విషయంలో సీబీఐ ప్రత్యేకంగా జోక్యం చేసుకునే అధికారం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వమైనా సిఫార్సు చేయాలి.. లేదా కోర్టు అయినా ఆదేశించాలి. ప్రస్తుతం నయీం కేసు విషయంలో రెండూ జరగలేదు. ఫోరం ఫర్ బెటర్ గవర్నెన్స్ సంస్థ.. కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా.. నయీం కేసును సీబీఐకి ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది.
నయీం కేసు విషయంలో సంచలన విషయాలు మొదట్లో వెలుగులోకి వచ్చాయి. నయీంను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత వేల కోట్ల ఆస్తుల గురించి సమాచరం బయటకు వచ్చంది. బస్తాల కొద్దీ నగదు… వందల్లో ఆస్తి డాక్యుమెంట్లు అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక మంది నేతల ప్రమేయంపైనా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో కానీ.. అంతా సైలెంటయిపోయారు. నయీం దందాలు చేసిన ఆస్తులు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. నయీం ఇంట్లో దొరికిన సొమ్ము కూడా… లక్షల్లోనే చెబుతున్నారు. నయీంతో సంబంధాలు ఉన్నాయని కొంత మంది పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసి.. మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. నేతలెవరికి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఈ క్రమంలో … సీబీఐ విచారణ అంశం ప్రస్తావనకు రావడం ఆసక్తి రేపుతోంది.
నయీం కేసులో విచారణ జరపడానికి కేంద్ర హోంశాఖ ఆసక్తి చూపించడం… తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజకీయంగా బలపడాలనుకున్న చోట్ల… ముందుగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దింపుతారు. అధికార పార్టీ నేతల ఆర్థిక అవకతవకలపై గురి పెడతారు. చివరికి వారందర్నీ పార్టీ మారేలా ఒత్తిడి చేస్తారు. బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో జరిగింది ఇదే. నయీం కేసు విషయంలో అనేక మంది నేతలకు సంబంధం ఉండటంతో.. వీరందర్నీ టార్గెట్ చేసిన బీజీపే సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తోందని అనుమానిస్తున్నారు. తెలంగాణ సర్కార్.. నయీం కేసును సీబీఐకిఇవ్వడానికి ఎలాగూ ఒప్పుకోదు. అయితే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారానే హైకోర్టులో పిటిషన్ వేయించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాస్త అటూ ఇటూ అయినా.. నయీం కేసులో సీబీఐ విచారణ ప్రారంభం కావొచ్చన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.