విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతూండటం… ప్రైవేటీకరణ అంశంలో ప్రతీ అడుగు ఏపీ సర్కార్‌కు చెప్పే చేస్తున్నారని కేంద్రం తేల్చేయడం వంటి వరిణామాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… కీలక నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష నేతలు… ట్రేడ్ యూనియన్లు అందరినీ తీసుకుని మోడీతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందు కోసం సమయం ఇవ్వాలంటూ ఆయన ఓ లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్రంలో సెంటిమెంట్‌గా మారినందున… ప్రభుత్వంలో ఉండి ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలకు తోడు… అధికార పార్టీగా ముందు ఉండి పోరాడాలని వస్తున్న పిలుపులకు జగన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. తన ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
అయితే… మోడీ అపాయింట్మెంట్ కోసం సీరియస్‌గా ప్రయత్నించి ఖరారైన తర్వాత… అందర్నీ తీసుకెళ్తే బాగుండేది కానీ.. తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకోవడానికి అన్నట్లుగా అందరితో కలిసి వస్తాం… అపాయింట్మెంట్ కావాలని అడగడం.. పబ్లిసిటీ స్టంట్ అని కొంత మంది విమర్శిస్తున్నారు. మామూలుగానే సీఎం జగన్ కొద్ది రోజుల కిందట అపాయింట్మెంట్ కోరారు. అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకిస్తారని.. కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పైగా… నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చేసిన కేంద్రం.. ఇప్పుడు ఓ సీఎం అఖిలపక్షాన్నితీసుకుని వస్తానంటే ఎలా అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్… ఇలాలేఖలు కుండా.. పోరాట పంధాలోకి రావాలని ఇతర అన్ని పార్టీలు కోరుతున్నాయి. తక్షణం ఎంపీలను రాజీనామా చేయించి… ఉద్యమంలోకి దిగాలని.. అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసి..కేంద్రం మెడలు వంచే ప్రణాళికను సిద్ధం చేయాలని కోరుతున్నారు. అయితే… జగన్మోహన్ రెడ్డి మాత్రం.. లేఖలు రాయడానికే ఆసక్తి చూపిస్తున్నారు అన్నీ ఏపీ సర్కార్‌కు తెలిసే జరుగుతున్నాయని కేంద్రం చెబుతున్నా.. వాటిని నేరుగా ఖండించలేకపోతున్నారు. మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చి…నేరుగా అఖిలపక్షాన్ని ఆయన వద్దకు తీసుకెళ్తే… జగన్ ప్రయత్నాల్లో కాస్తంత సిన్సియార్టీ ఉందనిప్రజలు నమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.