బిగ్ బాస్ ఫేం హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సొంత పెత్తనం మీద నియమించిన టీఆర్ఎస్ నేత.. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు .. మొట్టికాయలు పడ్డాయి. ఆయన తీరుపై సీఎంవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే.. టూరిజం శాఖ ఉన్నతాధికారులు టూరిజం శాఖ వెబ్ సైట్ నుంచి హారిక డీటెయిల్స్ ను తొలగించారు. ఇలా పదవి వచ్చిన ఒక్క రోజులోనే దేత్తడి హారిక పదవి ఊడిపోయింది. మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దేత్తడి హారికకు పదవి ప్రకటించి నియామక పత్రం అందించారు. ఈ నియామకం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కూడా తెలియదు.
ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారో ఏమో కానీ శ్రీనివాస్ గుప్తా నియామక పత్రం కూడా అందించారు. కానీ… బ్రాండ్ అంబాసిడర్లగా నియామకం అంటే.. పై స్థాయి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శ్రీనివాస్ గుప్తా అలాంటి ఆలోచన చేయలేదు. దీనిపై సీఎంవో కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వెంటనే… సీఎంవో నుంచి ఉప్పల శ్రీనివాస్ కు వార్నింగ్‌లు వచ్చాయి. శ్రీనివాస్ గౌడ్ సైతం వెంటనే.. హారిక నియామాకాన్ని నిలిపివేసి.. ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
అయితే హారిక నియామకం విషయంలో తెలంగాణ సర్కార్ పెద్దలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో.. అర్థం కాని విషయం. దేత్తడి హారిక తెలంగాణ యువతి. యూట్యూబ్‌లో ఆమె తెలంగాణ యాసతోనే పాపులర్ అయ్యారు. అయితే ఆమె టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేంత సెలబ్రిటీ కాదని.. ప్రభుత్వ పెద్దలు భావించారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తానికి అత్యుత్సాహం కారణంగా నామినేటెడ్ పదవి పొందిన టీఆర్ఎస్ నేతకు చిక్కులు ఏర్పడ్డాయి.