బెంగాల్ ఎన్నికల్లో ఏపీ సీన్లు రిపీటవుతున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబుకు ఉక్కపోత పోయించిన ఈసీ.. ఇప్పుడు మమతా బెనర్జీని అలాగే టార్గెట్ చేసింది. ఆమె నియమించిన అధికారులను బదిలీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారులందర్నీ బదిలీ చేసేవారు. వారిపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా… కేవలం వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఎలాంటి విచారణలు చేయకుండానే బదిలీ చేసేసింది. ఈ క్రమంలో బదిలీ అయిన వారిలో సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ లతో పాటు కొన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు కూడా ఉన్నారు.
వారిలో చాలా మంది తాము చేసిన తప్పేమిటని.. అకారణంగా బదిలీ చేశారని లేఖల రూపంలో ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయినా కారణం లేకుండానే ఈసీ బదిలీ చేస్తుందని… క్రమశిక్షణా చర్యలు కాదని.. అప్పటి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పుకొచ్చేవారు. అలా మారిన అధికారులు ఏం చేశారో.. టీడీపీ నేతలకు బాగా తెలుసు. ఎన్నికల ఫలితాలు రాక ముందే వైసీపీ పాలన ప్రారంభమయిందని.. టీడీపీ నేతలు మండి పడుతూ ఉంటారు. ఇప్పుడు బెంగాల్లోనూ అదే జరుగుతోంది. ఎనిమిది విడతల పోలింగ్‌లో ఇంకా మొదటి విడత ప్రారంభం కాక ముందే డీజీపీని బదిలీ చేసేశారు. ఆయనను ఎన్నికలకు దూరంగా పెట్టాలని ఈసీ ఆదేశించింది. బెంగాల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి. ఇక బీజేపీ ఫిర్యాదులు చేయడం.. ఈసీ బదిలీలు చేయడం కామన్‌గా మారిపోతుంది.
చివరికి మమతా బెనర్జీకి.. పదేళ్లుగా సీఎంగా ఉన్న అధికారం పేరుకే ఉంటుంది. అసలు పెత్తనం మాత్రం ఈసీ రూపంలో బీజేపీ చేయడం ప్రారంభిస్తుంది. ఈ రాజకీయాన్ని ఎలా డీల్ చేయాలో చేతకాక చంద్రబాబు చేతులెత్తేశారు. గోపాలకృష్ణద్వివేదీపై కేకలేసినా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దీదీ ఈ రాజకీయాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో అధికార పార్టీ అడ్వాంటేజ్ సాధారణంగా మమతా బెనర్జీకి రావాలి. కానీ ఇక్కడ బీజేపీకి వచ్చింది. మొత్తానికి ఈసీ పాలనలో మమతా బెనర్జీ నెగ్గుకొస్తారో లేదో వేచి చూడాలి..!