శర్వానంద్ కథల ఎంపిక బాగుంటుంది. పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లడు కానీ, కొత్త తరహా కథల్ని ఎంచుకుంటాడు. ఫ్యామిలీ, యూత్.. ఇద్దరినీ బాలెన్స్ చేస్తాడు. తనకు పెద్దగా మాస్ నప్పదు కాబట్టి.. వాటి జోలికి మాత్రం వెళ్లకుండా తెలివిగా నడుచుకుంటాడు. అందుకే తనకు డీసెంట్ రికార్డ్ ఏర్పడింది. ఈమధ్య శర్వా కి కొన్ని ఫ్లాపులొచ్చాయి. కానీ అవేం మరీ తీసిపారేయాల్సిన సినిమాలు కావు.కొన్ని సమీకరణాల వల్ల వర్కవుట్ కాలేదంతే. ఇప్పుడు `శ్రీకారం`తో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. గురువారం ఈ శ్రీకారం వస్తోంది. ఈ సందర్భంగా శర్వాతో చిట్ చాట్
* శ్రీకారం వ్యవసాయ నేపథ్యంలో నడిచే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. ఆ తరహా కథలు ఇది వరకూ వచ్చాయి. మహర్షి అలాంటి కథే. మరి వాటితో పోలిస్తే… శ్రీకారం ఎలా భిన్నంగా సాగుతుంది?
– వ్యవసాయం పాయింట్ తో చాలా సినిమాలు రావొచ్చు.కానీ.. ఆయా సినిమాల్లో చెప్పలేని పాయింట్ మా కథలో చెప్పాం. ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయం వల్ల లాభాలు చర్చించాం. కలసి వ్యవసాయం చేసుకుంటే, ఖర్చు తగ్గి ఆదాయం ఎక్కువ వస్తుంది. రైతులకు చాలా సమస్యలున్నాయి. సమస్య వచ్చిన ప్రతీసారీ ప్రభుత్వాల వైపు చూడాల్సివస్తోంది. అలా చూడకుండా, వాళ్ల సమస్యని వాళ్లే పరిష్కరించుకునేలా ఏం చేయొచ్చో… చూపించాం. నా దృష్టిలో రైతులే నిజమైన హీరోలు వాళ్లు లేకపోతే దేశం లేదు. ఈ సినిమా చూశాక రైతుల్ని చూసే దృక్కోణం మారుతుంది.
* ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని అంతగా ప్రేరేపించిన విషయాలేంటి?
– డాక్టరు ఇంట్లోంచి డాక్టరు, యాక్టరుఇంట్లోచి యాక్టరు వస్తున్నట్టు.. రైతు ఇంట్లో రైతు పుట్టడం లేదు. దీన్ని ఓ వృత్తిగా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల్లో ఉంది. క్రమంగా ఈ రంగాన్నీ కార్పొరేట్ కబళిస్తోంది. వాళ్ల చేతుల్లోకి వ్యవసాయం వెళ్లిపోతే.. రైతు అన్నవాడే మిగలడు. వ్యవసాయం ఎలా లాభసాటి వ్యాపారంగా మార్చుకోవచ్చో ఈ కథ ద్వారా చెబుతున్నాం. ఉద్యోగాలు వదలకుండానే రైతుగా ఎలా మారొచ్చో చూపిస్తున్నాం. ఈ పాయింట్లే నాకు బాగా నచ్చాయి.
* రైతులు.. వాళ్ల సమస్యలు, పరిష్కార మార్గాలూ అంటే.. లెక్చర్లు దంచినట్టు అవుతుందేమో?
– లెక్చర్లు దంచితే ఎవరూ సినిమా చూడరు. ఏ విషయాన్ని ఎలా చెప్పాలో అలానే చెప్పాలి.శ్రీకారంని అలానే తీర్చిదిద్దాం. వ్యవసాయం మాత్రమే కాదు. తండ్రీ కొడుకుల అనుబంధం చక్కగా ఆవిష్కరించిన చిత్రమిది. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. వాణిజ్య అంశాల్ని బాగా మేళవించాం. మంచి పాటలు కూడా కుదిరాయి.
* మీ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయి?
– వ్యవసాయం అంటే ఇష్టం, ప్రేమ ఏర్పరచుకున్న కుర్రాడి కథ ఇది. మంచి ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయరంగంలోకి వస్తాడు. రైతుగా మారతాడు. ఆప్రయాణమే ఈ కథ. నటుడిగా ఇలాంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.
* ఈ సినిమా చేస్తున్నప్పుడు, చేశాక… మీ ఆలోచనల్లో ఎలాంటి మార్పులొచ్చాయి?
– వ్యవసాయం పై ఇష్టం ఏర్పడింది. రైతుపై గౌరవం కలిగింది. హైదరాబాద్ లో నాకో ఫామ్ హౌస్ ఉంది. ఇక నుంచి అక్కడికి తరచూ వెళ్దామనుకుంటున్నా. అక్కడ వ్యవసాయం చేయాలని ఉంది. ఒకవేళ సినిమాలనుంచి తప్పుకుంటే కచ్చితంగా వ్యవసాయం చేస్తా.
* ఈ సినిమా చూశాక… ఎలాంటి మార్పులొస్తాయనుకుంటున్నారు?
– రైతులు, వ్యవసాయ రంగంపై ఇష్టం ఉన్నవాళ్లూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. సాంకేతిక పద్ధతుల్ని ఉపయోగించుకుని వ్యవసాయం ఎలా చేయాలో అర్థం అవుతుంది. రైతంటే ఎవరు? వాళ్ల కష్టాలేంటి? అనేవి అర్థం అవుతాయి.
* మీ భవిష్యత్ ప్రణాళికలేంటి?
– ఇక మీదట యేడాదికి మూడు సినిమాలు వచ్చేలా చూసుకుంటా. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని పట్టాలెక్కించాలి. మహా సముద్రం 60 శాతం పూర్తయ్యింది. ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాం. ఆడవాళ్లూ మీకు జోహార్లూ.. సినిమా చేస్తున్నా. ఇందులో మహిళల గొప్పదనం చూపించబోతున్నాం. పెళ్లికాని యువకుడి పాత్రలో కనిపిస్తా.