విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ ఓకే అంటే.. విశాఖ వెళ్లి ఉద్యమంలో కూడా పాల్గొంటామని ప్రకటించారు. హఠాత్తుగా కేటీఆర్‌కు ఏపీకి వచ్చిన కష్టంపై అంత సానుభూతి ఎందుకు చూపారంటే.. దానికి పెద్ద లాజిక్కులేం అవసరం లేదు. ఆయన బీజేపీని కార్నర్ చేయాలనుకున్నారు కాబట్టే… మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. వాటిల్లోనూ బీజేపీ గెలిస్తే… ప్రత్యామ్నాయంగా అవతరించినట్లే అవుతుంది. అందుకే బీజేపీని కంట్రోల్ చేయడానికి కేటీఆర్ కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనే లిస్ట్ చదువుతూ.. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని వాదిస్తున్నారు. అదే సమయంలో ఏపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలోనూ.. బీజేపీని దోషిగా నిలబెట్టి ఓటర్లలో వ్యతిరేకత పెంచాలనే వ్యూహాన్ని కేటీఆర్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీని కార్నర్ చేయడానికి ఏ అవకాశం వచ్చినా వినియోగించుకుంటున్నారు. బెంగళూరులో ఐటీఐఆర్‌ను క్యాన్సిల్ చేయడంపైనా స్పందించారు. అదే కోణంలో ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ.. కేటీఆర్ ప్రకటన మాట వరుసకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి ఉండకపోవచ్చు. కేటీఆర్ ప్రకటన ఏపీ అధికార పార్టీని కాస్త ఇబ్బంది పెట్టింది. ప్రైవేటీకరణ విషయంలో వ్యతిరేకం అని మాటలు మాత్రమే చెబుతున్న అధికార పార్టీ కి.. కేటీఆర్ నేరుగా వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పడం మింగుడుపడని అంశమే. ఎందుకంటే.. ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం అంతా వైసీపీకే చుట్టుకుంటోంది. ప్రైవేటీకరణను ఆపకగాపోగా.. ఇంకా సహకరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కేటీఆర్ వస్తే మరింత ఇబ్బందికరం అవుతుంది. అయితే అలాంటి పరిస్థితి రాదని నమ్ముతున్నారు. అందుకే.. మంత్రి అనిల్ కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు.