సీఎం అయితే జగన్ కంటే తానే గొప్పగా రాజకీయం చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించుకోవడం ఇప్పుడు ఆయనకు వైసీపీలో కష్టాలు తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. జగన్ జైలుకెళ్తే ఆయనకే సీఎంగా మద్దతన్నట్లుగా మాట్లాడారు. బయటకు ఎవరూ ఈ అంశంపై మాట్లాడకపోయినప్పటికీ… వైసీపీలో చర్చోపచచర్చలు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి ఏదో ఫ్లోలో తాను సీఎం అయితే అని.. మాట్లాడి ఉంటే పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ.. ఆయనపై కొంత కాలంగా వైసీపీలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. జగన్ జైలుకెళ్లే అవకాశం ఉందని.. అందు కోసం.. వైసీపీలోనే వర్గాన్ని పెంచుకుంటున్నారని.. ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా సీమ జిల్లాలతో పాటు.. తాను ఇంచార్జ్‌గా ఉన్న జిల్లాలు.. ఆ చుట్టుపక్కల జిల్లాల్లో చాలా మందికి వైసీపీలో పొలిటికల్ గాడ్ ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇలా అందరితోనూ ఓ వర్గాన్ని వ్యూహాత్మకంగా పెంటుకుంటున్నారని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నేరుగా ఆయన నోటి నుండే.. తానే సీఎం అన్న మాట బయటకు వచ్చింది. ఇంత వరకూ వచ్చిన తర్వాత సీఎం జగన్ పెద్దిరెడ్డిపై సైలెంట్‌గా ఉండే అవకాశం లేదనిచెబుతున్నారు. ఉన్న పళంగా ఆయనను గెంటేయకపోవచ్చు కానీ.. మెల్లగా ప్రాధాన్యం తగ్గిస్తారని చెబుతున్నారు. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.
తానుచేయాలనుకున్నది చేస్తున్నారు. ఇంత హావా సీఎం జగన్ చాన్సివ్వడం వల్లేనని.. అయితే అది తన బలంగా పెద్దిరెడ్డి భావిస్తున్నారని వైసీపీలోని ఓ వర్గం అనుకుంటోంది. అందుకే.. .ఆయనకు చెక్ పెట్టడానికి… వైసీపీలో రూట్ మ్యాప్ రెడీ అయి ఉండే ఉంటుందని అంటున్నారు. టీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న ఈటల.. అక్కడ నాయకత్వ మార్పు జరిగితే.. రేసులో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది దాంతో ఆయనను దాదాపుగా పక్కన పెట్టేశారు. అలాంటి పరిస్థితే.. వైసీపీలో పెద్దిరెడ్డికి ఏర్పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది.