మచిలీపట్నం పోలీసులు కొల్లు రవీంద్రను మరోసారి అరెస్ట్ చేశారు. ఉదయమే ఆయన కుటుంబసభ్యులతో గుడికి వెళ్తూంటే.. అడ్డగించి అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పి తీసుకుపోయారు. ఎందుకు అంటే… బందరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల సందర్శిస్తున్నప్పుడు ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారట. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. ఆ కారణంగానే ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పి తీసుకుపోయారు. అయినను న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అయితే.. ఓ వ్యక్తిని ఇలా కూడా అరెస్ట్ చేయవచ్చా అని ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి అరెస్ట్ విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని బెయిల్ ఇచ్చారు. దీంతో అరెస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే బెయిల్ లభించింది.
అయితే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొల్లు రవీంద్ర బయట ఉండకూడదని.. జైల్లో ఉంటేనే.. అక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆయనను అరెస్ట్ చేయించారని.. టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు సహా అందరూ పోలీసుల తీరును ఖండించారు. ఆదివారం వరకూ కోర్టులకు సెలవు కాబట్టి సహజంగా న్యాయమూర్తులు వాయిదా వేస్తారని.. బెయిల్ పిటిషన్ వేసుకుంటే సోమవారం తర్వాతే విచారణకు వస్తుందని అనుకున్నారు. కానీ న్యాయమూర్తి … అరెస్టులో ప్రొసీజర్ ఫాలో కాలేదని.. బెయిల్ ఇచ్చేశారు.
కొద్ది రోజుల కిందట.. పంచాయతీ ఎన్నికలకు ముందు దెందులూరు మాజీ ఎమ్మెల్యే్ చింతమనేని ప్రభాకర్ ను కూడా అంతే అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం చేసి వెళ్లిపోయిన ఊరిలో గొడవ జరిగిందని ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే న్యాయమూర్తి ఆ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని బెయిల్ ఇచ్చేశారు. అప్పుడుచింతమనేని.. తప్పుడు కేసు పెట్టారని.. తాను వెళ్లబోనని.. స్టేషన్లోనే ఉండిపోయారు. బలవంతంగా పోలీసులు ఇంటి వద్ద దింపి వెళ్లారు. ఇటీవలి కాలంలో పోలీసులు రాజకీయ అవసరాల కోసం.. ఇలా అరెస్టలు చేస్తూ.. చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. హైకోర్టు సైతం పలుమార్లు రూల్ ఆఫ్ లా గురించి హెచ్చరించిన వారి తీరులో మార్పు రావడం లేదు.