రేటింగ్:3/5
నవ్వుకి లాజిక్కులు అవసరం లేదు. జస్ట్ మ్యాజిక్ జరిగిపోతే చాలు. తెరపై సన్నివేశం చూసి. జనాలు నవ్వుకుంటారా? లేదా? అనేది ఆలోచిస్తే చాలు. ఇంకేం అక్కర్లెద్దు. `ఇది చూసి జనాలు నవ్వేస్తార్రా..` అనుకుంటే ఆ పాయింట్ వర్కవుట్ అయిపోతుందంతే! `జాతిరత్నాలు` అలానే పుట్టిన కథ అనిపిస్తుంది. ముగ్గురు ఆవారా గాళ్లు – వాళ్లు చేసిన తెలివి తక్కువ పనులు – దాన్నుంచి వచ్చిన తిప్పలు – అందులోంచి పుట్టిన నవ్వులు వెరసి – జాతి రత్నాలు.
`ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ బుర్రకు పని చెప్పకండి` అని హీరో నవీన్ పొలిశెట్టి, ముందే హింట్ ఇచ్చేశాడు. అందుకే.. బుర్రని కాసేపు డీఫ్రిజ్ లో పెట్టి, థియేటర్‌కి వెళ్తే.. హాయిగా నవ్వుకుని తిరిగెళ్లిపోవచ్చు.
ఇంతకీ ఈ జాతిరత్నాలు ముచ్చటేంటంటే.. జోగిపేట్ శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి)… అత్తెసరు మార్కులతో డిగ్రీ పాసైన బ్యాచ్. ఊర్లో లేడీస్ ఎంపోరియమ్ చూసుకుంటుంటాడు. అయితే.. తనకు ఆ పని నచ్చదు,. హైదరాబాద్ వెళ్లిపోయి, మెడలో ట్యాగ్ వేసుకునే జాబ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంట్లో నాన్న (తనికెళ్ల భరణి)తో సవాల్ చేసి, తన దోస్తులు (ప్రియదర్శి, రాహుల్ రమకృష్ణ)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అనుకోకుండా..స్పోర్ట్స్ మినిష్టర్ చాణిక్య (మురళీశర్మ) పై హత్యాయత్నం కేసులో.. అరెస్ట్ అవుతారు. సాక్ష్యాలన్నీ.. ఈ ముగ్గురు స్నేహితులకు ప్రతికూలంగా ఉంటాయి. అయితే.. ఈ కేసు నుంచి బయటపడడానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదే.. సెల్ ఫోన్. ఓ సెల్ ఫోన్లో మినిస్టర్ చాణిక్యకి సంబంధించిన రహస్యం దాగి ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? అది మన జాతి రత్నాలకు దొరికిందా, లేదా? ఇంతకీ చాణిక్యని చంపాలనుకున్నది ఎవరు? అన్నది మిగిలిన కథ.
నిజానికి దర్శకుడు.. చాలా లైటర్ వేలో రాసుకున్న కథ ఇది. ఎంత లైటర్ గా ఉందంటే. సీరియస్‌గా సాగాల్సిన కోర్టు రూమ్ లో కూడా కామెడీ పండించాలనుకున్నంత. ప్రతీ సీనూ అలానే సాగుతుంది. జోగిపేటలో జాతిరత్నాల అల్లరి దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఆయా సన్నివేశాలన్నీ హాయిగా సాగిపోతాయి. హైదరాబాద్ వచ్చి..ఓ గేటెడ్ కమ్యునిటీలోని అపార్ట్మెంట్లో సెటిల్ అవ్వడం, అక్కడ చిట్టితో ప్రేమాయణం నడపడం.. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కామెడీగా సాగిపోతాయి. ప్రతీ డైలాగ్ లోనూ ఏదో ఓ మెరుపు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.
ఓ సన్నివేశంలో “కట్నంకింద పది తులాల బంగారం, నాలుగు ఎకరాల పొలం ఇద్దామనుకుంటున్నారు“ అని పంతులుగారంటే… ` అంటే పిల్లనివ్వరా..` అంటూ సెటైర్ వేస్తాడు హీరో. దాదాపు ప్రతీ డైలాగ్ ఇలానే సాగుతుంది. అవన్నీ ఫన్నీగా ఉంటాయి. మినిస్టర్ పై హత్యాయత్నం కేసులో ఇరుక్కోవడంతో ఇంట్రవల్ పడుతుంది. అక్కడి నుంచి కథ క్రైమ్ జోనర్లోకి వెళ్తుందేమో అనుకుంటారంతా. కానీ.. ఆ క్రైమ్ ని కూడా కామెడీ చేసేశారు. కొన్ని చోట్ల.. అది వర్కవుట్ అయ్యింది. ఇంకొన్ని చోట్ల.. `మినిస్టర్ పై హత్యాయత్నం కేసుని కూడా ఇంత కామెడీ చేయాలా` అనిపిస్తుంది. క్రైమ్ సీన్లో కామెడీ చేయడం ఓకే. కాకపోతే… ఆ క్రైమ్ నుంచి హీరో బ్యాచ్ ఎలా బయటపడతారో? అనే టెన్షన్ ప్రేక్షకులకు కలగాలి. అలా జరగాలి అంటే.. క్రైమ్, దాని చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ అయినా కాస్త సీరియస్ గా ఉండాలి. సీన్ సీరియస్ గా ఉంటూ.. అందులోంచే ఫన్ ఉండేలా చూసుకోవాలి. కానీ దర్శకుడు కేవలం ఫన్ పై ఫోకస్పెట్టడంతో, సీరియస్‌నెస్ తగ్గింది. ద్వితీయార్థంలో దర్శకుడు లాజిక్ అనే జోలికే పోలేదు. ఏ సీన్ లోనూ లాజిక్ ఉండదు. కొన్ని సీన్లు సెట్లో కూర్చుని రాసుకున్నారేమో అనిపిస్తుంది. రోడ్డుపై ఉరుకులు పరుగులు, విలన్ గ్యాంగ్ ని తప్పించుకుని తిరగడం.. ఇదంతా `అనగనగా ఓ రోజు`, `మనీ` సినిమాల టైపు సీన్లు. పైగా కొన్ని సీన్లు రిపీటెడ్ గా అనిపిస్తుంది. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలో కామెడీ డోసు బాగా తగ్గిపోయింది. అయితే క్లైమాక్స్ కి ముందు.. కోర్టు సీనులో నవీన్ పొలిశెట్టి డైలాగులు, చేసిన కామెడీ ఊరట కలిగిస్తాయి. ప్రధమార్థంలో హాయిగా నవ్వుకున్న ప్రేక్షకుడికి.. మళ్లీ కొన్ని నవ్వులు దక్కేది.. అక్కడే. ఇంతకీ వీడియోలో ఏముంది? అన్నది అందరిలోనూ ఉత్కంఠత రేపిన విషయం. అయితే దాన్నీ కూడా కామెడీ చేసేశాడు దర్శకుడు. క్లైమాక్స్ చూస్తే. `ఓస్.. దీని కోసం ఇంత చేయాలా` అనిపిస్తుంది. చెప్పాం కదా.. దర్శకుడు లాజిక్ లను పూర్తిగా పక్కన పెట్టేశాడని.
నవీన్పొలిశెట్టి కామెడీ టైమింగ్ ఈ సినిమాకి వరం. తన బాడీ లాంగ్వేజ్, సెటైరికల్ డైలాగ్ డెలివరీతో చాలా సన్నివేశాల్ని నిలబెట్టేశాడు. ఈ పాత్ర తను మాత్రమే చేయగలడు అనిపించేలా చేశాడు. తనకి ప్రియదర్శి, రాహుల్…మంచి సహకారం అందించాడు. రాహుల్ అయితే.. `దీనంతటికీ కారణం నేనే అయితే.. నే వెళ్లిపోతా` అన్నప్పుడల్లా నవ్వులు పూస్తాయి. కుక్కర్ విజిల్ సౌండ్ ని ఆస్వాదించే పాత్రలో.. ప్రియదర్శి మెప్పిస్తాడు. ఒకొక్క పాత్రకూ ఒక్కో మేనరిజం ఇచ్చాడు దర్శకుడు. హీరోయిన్ బొద్దుగా ఉంది. మురళీశర్మ ఓకే అనిపిస్తాడు. నరేష్, తనికెళ్ల భరణి… డిటో చేసుకుంటూ వెళ్లిపోయారు.
చాలా సింపుల్ కథ. పరమానందయ్య శిష్యుల కథ టైపు. సరదా సన్నివేశాలు బాగా రాసుకోవడం వల్ల… కాలక్షేపం అయిపోతుంది. డైలాగుల్లో సెటైర్లు ఎక్కువ ఉన్నాయి. చిట్టి.. పాట విడుదలకు ముందే.. మంచి ఊపు తీసుకొచ్చింది. థియేటర్లోనూ బాగానే అనిపిస్తుంది. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా ఇది. ఆ రకంగా నిర్మాతలు ముందే హ్యాపీ. ద్వితీయార్థానికి ఇంకాస్త మెరుగులు పెట్టి, ఇంకొన్ని మెరుపులు జోడిస్తే.. మంచి ఎంటర్టైనర్గా నిలిచేది. ఇప్పుడు మాత్రం జాతిరత్నాలు… ఓకే సినిమాగా మిగిలిపోతుంది.
రేటింగ్:3/5