ఇప్పుడు సీడీల యుగం కూడా అయిపోయింది. సీడీలు వచ్చింత వేగంగా అంతర్థానం అయిపోయాయి. కానీ కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీడీ అనే పేరు వినిపిస్తే.. సీఎం యడ్యూరప్ప నుంచి మంత్రులు అందరూ ఉలిక్కి పడుతున్నారు. మంత్రి రమేష్ జార్కిహోళి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత… రాజకీయ ప్రముఖులు అనేక మంది టెన్షన్‌కు గురవుతున్నారు. ఫలానా సీడీ ..బయటపెడతామంటూ.. సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడం.. మరికొందర వైరల్ చేయడం కామన్ అయింది. చివరికి అదంతా ఉత్తదే అని తెలిసి..గుండెలు చిక్కబట్టుకోవడం.. ప్రజాప్రతినిధుల వంతు అయింది. చివరికి సీఎం యడ్యూరప్పకు చెందిన సీడీ కూడా ఉందని… బీజేపీకే చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.
కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి సర్కార్ ను కూలగొట్టేందుకు గతంలో ఆపరేషన్ కమల నిర్వహించారు. కాంగ్రెస్ , జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల క్యాంప్ ముంబైలో ఏర్పాటు చేశారు. అక్కడ వారికి కావాల్సిన విందులు.. పొందులు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. చాలా కాలం పాటు అక్కడ క్యాంప్ జరిగింది. ఆ సమయంలోనే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల జల్సాలను పకడ్బందీగా రికార్డు చేశారని.. తర్వాత తోక జాడించకుండా ప్లాన్ చేశారన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరి సీడీలు ఉన్నాయని ప్రచారం జరగడమే కాదు.. అలాంటి వారు… తమ గురించి ఎలాంటి సీడీలు ప్రసారం చేయవద్దని కోర్టును ఆశ్రయించడంతో.. ఇదంతా నిజమేనని అనుకునే పరిస్థితి ఏర్పడింది.
రమేష్ జార్కిహోళి సీడీ మార్ఫింగ్ అని తేల్చి… రాజకీయ వాతావరణాన్ని తేలిక చేయడానికి యడ్యూరప్ప సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. అది నకిలీదని హోంమంత్రి ముందుగానే ప్రకటించారు. అది ఎవరు తయారు చేశారో తేల్చడానికే దర్యాప్తు అని చెబుతున్నారు. ఈ క్రమంలో… సీడీని బయట పెట్టిన… సామాజిక కార్యకర్తను నిందితుడిగా మార్చినా ఆశ్చర్యం లేదు. కానీ… ప్రజలు మాత్రం… బీజేపీ రాజకీయాల్ని చూసి.. ముక్కున వేలేసుకుంటున్నారు.