తన పదవి కాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఏపీ సర్కార్‌పై దండయాత్రలా న్యాయపోరాటం చేసి చాన్స్ దక్కించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన పని మధ్యలో ఉండగానే తీర్థయాత్రల కోసం సెలవు పెట్టుకున్నారు. ఈ విషయం బయటకు తెలిసే సరికి.. ఆయన సెలను క్యాన్సిల్ చేసుకోవడం కూడా అయిపోయింది. అసలు నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్న సమయంలో సెలవు పెట్టుకోవడం ఏమిటి..? మళ్లీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందన్న కారణంగా రద్దు చేసుకోవడం ఏమిటో… చాలా మందికి అర్థం కావడంలేదు. ఈనెల 19 నుంచి 22 వరకు ఎల్టీసీపై ముధురై రామేశ్వరం వెళ్లాలనుకుంటున్నారని.. అనుమతి ఇవ్వాలని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఓ లేఖ పెట్టుకున్నారు.
అంతకు ముందు 17 నుంచి 24 వరకు సెలవులు కోరారు. ఆయన ఈశాన్య రాష్ట్రానికి వెకేషన్‌కు వెళ్తున్నారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు ప్రతిపాదనల్ని కూడా నిమ్మగడ్డ విరమించుకున్నారు. దానికి కారణం ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించడమే. నిజానికి పధ్నాలుగో తేదీన కౌంటింగ్ పూర్తయిన తర్వాత మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందనేది.. ప్రత్యేకంగా చెప్పాల్సిన విధి కాదు. ఆ విషయం తెలిసి కూడా గతంలో నిమ్మగడ్డ సెలవు అడిగారు. మున్సిపల్ ప్రక్రియ పూర్తవగానే.. పరిషత్ ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే కోర్టులో కేసు తేలదని ఆయన డిసైడయినట్లుగా ఉన్నారు. కోర్టు పర్మిషన్ ఇస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి కూడా.. నిమ్మగడ్డ లీవ్ పేరుతో ఎందుకు గవర్నర్‌ను కంగారు పెట్టే ప్రయత్నం చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 31నే నిమ్మగడ్డ రిటైరవుతారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ ఎల్టీసీ ఉపయోగించుకునే చాన్స్ ఉండదని.. ఆయన లీవ్ పెట్టాలనుకున్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే.. గవర్నర్‌కు తాజాగా చేసిన వినతిలో తన సెలవులను కొత్త తేదీలతో రీషెడ్యూల్కు అనుమతించాలని కోరారు నిమ్మగడ్డ. తన ఉద్యోగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇలా నిమ్మగడ్డ.. లీవులు అప్లయ్ చేసి వెనక్కి తగ్గారా అని కొంత మంది ఆశ్చర్యపోతున్నారు.