ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలపై సినీ పెద్దలు స్పందించడం లేదన్న అసహనం.. ఉద్యమకారుల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఇంత కాలం వారి సమస్యలు వారికి ఉంటాయి అని లైట్ తీసుకున్నారేమో కానీ.. ఇప్పుడు మాత్రం… వారిపై నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. విశాఖలో మంచు విష్ణు మూవీ మోసగాళ్లు షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌ను ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా సినిమా పెద్దలు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా షూటింగులు, సినిమా ఫంక్షన్ల కోసం ఏపీకి ఎవరొచ్చినా అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ ఆందోళనపై… మంచు విష్ణు స్పందించారు. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సినీ పెద్దలతో కలిసి… ఉద్యమానికి సంఘిభావంగా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇంత కాలం కొన్ని సమస్యల వల్ల స్పందించలేకపోయామని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు… వ్యాపార ప్రయోజనాలు.. ప్రభుత్వాలను ఎదిరిస్తే.. దర్యాప్తు సంస్థలు దాడులు జరుగుతాయని భావించి చాలా మంది నోరు తెరవడం లేదని భావిస్తున్నారు. ఇంత కాలం ఓపిక పట్టిన జనం.. ఇప్పుడు.. అస్థిత్వానికి చిక్కులు తెచ్చే సమస్యలు ఎదురైనా.. స్పందించకపోవడంపై… అసహనానికి గురవుతున్నారు.
ఆ విషయం మోసగాళ్లు యూనిట్‌ను అడ్డుకోవడంతోనే తేలిపోయిందంటున్నారు. గతంలో అమరావతి రైతులకు సంఘిభావం చెప్పకుండా.. కొంత మంది సినీ పెద్దలు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లారు. అప్పుడు కూడా రైతుల నిరసన ఎదుర్కొన్నారు. ఇక నుంచి టాలీవుడ్ పెద్దలు ఏపీలోకి వెళ్లాలంటే… ప్రజల సమస్యలపై స్పందించాల్సిన పరిస్థితి ఉండొచ్చని.. తాజా ఘటనలు నిరూపిస్తున్నాయంటున్నారు.