తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈలోగానే బిజెపి నేతలు పలువురు తిరుపతి ఎంపీ స్థానానికి జనసేన బీజేపీ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ప్రకటించారు. సహజంగానే ఈ నిర్ణయం జనసేన అభిమానులకు నిరాశ కలిగించింది. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో, నామినేషన్ వేసిన తర్వాత కూడా బిజెపి విజ్ఞప్తి మేరకు జనసేన తమ అభ్యర్థులను బరిలో నుండి తప్పించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతిసారి బిజెపి కోసం జనసేన సీట్లు వదులుకోవడం జనసైనికులకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు తిరుపతి స్థానానికి బిజెపికి మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు.
ముందుగా తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై పలు దఫాలుగా అటు బీజేపీ జాతీయ నాయకత్వంతో, ఇటు రాష్ట్ర నాయకత్వం తోనూ చర్చలు జరిగాయని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతి ని అభివృద్ధి చేస్తామని బిజెపి బలమైన హామీ ఇచ్చిందని, తిరుపతి అభివృద్ధి, రాష్ట్రానికి జరిగే మేలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానికి తోడు ఇటీవలికాలంలో ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి స్థానంలో బిజెపి నిలబడడం సముచితంగా ఉంటుందని భావించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్సిపి ఆగడాలకు దీటయిన సమాధానం చెబుతామని, జిహెచ్ఎంసి ఎన్నికల మాదిరిగా తిరుపతి ఉప ఎన్నిక కూడా జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని బిజెపి నాయకులు హామీ ఇచ్చిన కారణంగా ఈ సీటు బిజెపి పార్టీకి వదులుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అయితే ఇటీవల కొంతకాలంగా జనసేన అభిమానులు తిరుపతిలో జనసేన కి సీట్ ఇవ్వకపోతే తాము బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వము అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, వారిని సముదాయించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు లేఖలో స్పష్టం అవుతోంది. దూరదృష్టితో జనసేన కార్యకర్తలు ఆలోచించాలని, తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులను ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న బంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది భవిష్యత్తులో తేలుతుంది.