ఆంధ్రప్రదేశ్లో కోర్టులకు వరుసగా మూడు, నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయంటే… టీడీపీ నేతలు వణికిపోతున్నారు. వైసీపీ నేతలు ఎక్కడ ఏ తప్పుడు కేసు పెట్టి.. ఏదో ఓ ఫిర్యాదు చేసి.. తమకు ఎక్కడ అరెస్ట్ చేయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అరెస్టులు మాత్రమే కాదు.. ఆస్తుల విధ్వంసం కూడా జరుగుతోంది. కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా… చూసుకుని… వచ్చిన పని పూర్తి చేసేలా.. కూల్చివేతలు చేసేసి.. తర్వాత కోర్టు నుంచి ఊరట పొందినా ఆ నష్టం అలాగే ఉండేలా… వైసీపీ నేతలు అధికారులతో కలిసి వ్యూహాత్మకంగా విధ్వంసానికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు… చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల కిందట… నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయారు. సాక్షులు ఎవరో చెప్పారంటూ… ఆయన మరణానికి కారణం అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల కిందట.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే గా సత్తి సూర్యనారాయణరెడ్డికి మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా.. రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ మృతి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. అక్రమ కేసులతో ఇంకెంత మందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,చింతమేని ప్రభాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే.. పోలీసుల బారిన పడుతున్న టీడీపీ నేతల చిట్టా చాలా ఎక్కువే ఉంది. మూడు నాలుగు రోజులైనా.. జైలులో పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ వ్యూహాలను పోలీసులు అమలు చేస్తూండటంతో ఎలా ఎదుర్కొవాలో తెలియక టీడీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు.