ఏం మాట్లాడుతున్నావ్ రా.. ** అంటూ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. విజయ్ మాట్లాడింది.. పరమ బూతు. ఆ సినిమాలో, ఆ సన్నివేశంలో, ఆ ఎమోషన్లో… అర్జున్ రెడ్డిలా బిహేవ్ చేసే ఓ క్యారెక్టర్..అలా మాట్లాడింది. దాన్ని చాలామంది తప్పు పట్టారు. ఇలాంటి డైలాగుల్ని సెన్సార్ ఎలా ఒప్పుకుంటుందో? అని నిలదీశారు. అయితే అది కొన్ని రోజులే. ఆ తరవాత. మామూలైపోయింది. ఆ తరవాత… ఆ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. మీమ్స్ లోనూ అదే. డీజే లోనూ అదే.
ఇప్పుడు అదే డైలాగ్ ని నాగార్జున కూడా.. వల్లించేశాడు. `వైల్డ్ డాగ్` ట్రైలర్.. ఆఖరి మాట అదే. ఆ సినిమాలో నాగార్జున, ఏ సందర్భంలో ఆ డైలాగ్ చెప్పాల్సివచ్చిందో తెలీదు గానీ… నాగ్ కూడా బూతులు మాట్లాడితే ఎలా?? అనిపిస్తోంది. అది టెర్రరిస్టుల్ని ఉద్దేశించి చెప్పిన డైలాగే కావొచ్చు. కానీ.. భావావేశాన్ని ప్రకటించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. డైలాగ్ లేకుండానూ.. మన ఉద్దేశ్యాన్ని, కోపాన్నీ, ఆలోచననీ ప్రకటించొచ్చు. ఆ డైలాగే వాడాల్సిన అవసరం లేదు. సినిమాకున్న శక్తి ఏమిటంటే.. చిన్న డైలాగైనా చాలా త్వరగా పాపులర్ అయిపోతుంది. చిన్న పిల్లలు సైతం అనుకరించేస్తారు. అదేం బూతు కానట్టు, వ్యవహారికంలా చలామణీ అయిపోతుంది. అదెంత పెద్ద బూతు? అమ్మని తిట్టడం ఏమిటి? అమ్మ ఎవరికైనా అమ్మేకదా..? ఇలాంటి బూతులు డైలాగుల్లో చేరినప్పుడు… అగ్ర కథానాయకులు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లకంటూ ఓ స్థాయి, హోదా ఉన్నాయి. వాళ్లకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా… హీరోల్ని, వాళ్ల మాటల్నిఅనుకరించడానికి రెడీగా ఉంటారు. ఇప్పటికే… విజయ్ దేవరకొండ వల్ల… ఆ బూతు సర్వసాధారణమైన పదంలా మారిపోయింది. ఇప్పుడు నాగ్ కూడా అవే మాటలు మాట్లాడితే ఎలా? సెన్సార్ వాళ్లయినా ఆ డైలాగ్ పై బీప్ వేస్తారో లేదో..?