పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో హరి హర వీరమల్లు తెరకెక్కుతోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై క్రిష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తనకు కమర్షియల్ హిట్లు కొట్టడం చేతకాదు… అనే విమర్శను ఈ సినిమాతో తిప్పి కొట్టడానికి ఫిక్సయ్యాడు. అందుకోసం… ఈ సినిమాలో అన్ని రకాలైన కమర్షియల్ యాంగిల్స్ మిక్స్ చేస్తున్నాడు.
అయితే నిజానికి ఇది వపన్ కోసం రాసుకున్న కథ కాదు. వరుణ్ తేజ్ కోసం రాసింది. కంచె తరవాత వరుణ్‌తో ఓ మరో సినిమా చేద్దామనుకున్నాడు క్రిష్. అప్పుడే `వీరమల్లు` కథ కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ వరుణ్ మార్కెట్ కీ, ఈ సినిమా బడ్జెట్ సహకరించలేదు. వరుణ్ తేజ్ మార్కెట్ కంటే బడ్జెట్ రెండు మూడింతలు ఎక్కువ కావడంతో… ఈ కథని పక్కన పెట్టారు. ఆ సమయంలోనే.. జేమ్స్ బాండ్ తరహా స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్టు తయారు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ.. ఆ కథ కూడా పక్కకు వెళ్లిపోయింది. అప్పటి వరుణ్ కోసం అనుకున్న కథ.. ఇప్పుడు పవన్ చేతికి చేరింది.