ఆంధ్రప్రదేశ్‌కు స్టీల్ ఫ్యాక్టరీ అంటేనే రాజకీయంగా అచ్చి రానట్లుగా పరిస్థితి మారిపోయింది. విశాఖ స్టీల్ ఉదంతం ఓ వైపు సంచలనం సృష్టిస్తూండగానే మరో వైపు… కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాది పడక ముందే నిర్వీర్యమయ్యే పరిస్థితికి చేరింది. దీనిపై రాజకీయ రగడ కూడా ప్రారంభమయింది. కడప ఉక్కు పరిశ్రమను నిర్మించేందుకు బ్రిటన్‌కు చెందిన లిబర్టీ స్టీల్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. మొదటి దశలో రూ. పదివేల కోట్ల పెట్టుబడి అనుకున్నారు. కానీ ఇంకా పునాది కూడా వేయక ముందే ఆ సంస్థ బ్రిటన్‌లో దివాలా పిటిషన్ వేసే పరిస్థితికి చేరిపోయింది. రుణాలు చెల్లించకపోవడంతో.. యూరప్‌లోని పలు దేశాలు.. ఆ కంపెనీపై గట్టి నిఘా ఏర్పాటు చేశాయి. దీంతో ఇక్కడ ఏపీలో రాజకీయ రచ్చ ప్రారంభమయింది.
నిజానికి కడప స్టీల్ ప్లాంట్ ను పోస్కో తో నిర్మింప చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఆ మేరకు ఆ సంస్థతో చర్చలు జరిపానని కూడా ప్రకటించారు. కానీ ఆ సంస్థ అంగీకరించలేదని… అందుకే కృష్ణపట్నంలో పెట్టమన్నానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పోస్కో కూడా వద్దన్న చోట.. లిబర్టీ స్టీల్స్ సంస్థ ప్లాంట్ పెట్టడానికి సిద్ధమయింది. అంతా రెడీ అనుకున్న సమయంలో ఆ సంస్థ దివాలా ప్రక్రియకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ పేరుతో తెర వెనుక ఆర్థిక వ్యవహారాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే మభ్య పెట్టారని.. ఇంకెన్ని మాటలు చెబుతారని వారంటున్నారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు గనులు కూడా ఉన్నాయి. వాటిని కేటాయిస్తూ.. ఎన్ఎండీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ గనుల్లో… నాణ్యమైన ఇనుప ఖనిజం ఉందా లేదా అన్నదానిపై మాత్రం… భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లన్నీ.. ఇక్కట్లలో ఉన్నాయి. విశాఖ స్టీల్స్ లాంటి ప్లాంట్ ను.. అమ్మడమో.. లేదా మూసివేయడమో చేయాలని కేంద్రం ఆలోచిస్తున్న సమయంలో వేల కోట్ల పెట్టుబడులు కొత్త ప్లాంట్లకు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తాయా అన్నది కీలకంగా మారింది.