ప్రియదర్శి… ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. పెళ్లి చూపులుతో తనదైన మార్క్ చూపించి, నిలబడిపోయాడు. మల్లేశం లాంటి మంచి సినిమాతో హీరో అయ్యాడు. `జాతి రత్నాలు`తో మళ్లీ పడీ పడీ నవ్వేలా చేశాడు. కమెడియన్ గా మరో పదేళ్ల పాటు.. నిలబడిపోయేంత మైలేజీ తెచ్చుకున్నాడు. అయితే తన దృష్టి ఇప్పుడు డైరెక్షన్ పై పడింది. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని అంటున్నాడు ప్రియదర్శి. అందుకోసం కథ సిద్ధం చేస్తున్నానని చెప్పాడు. అయితే దర్శకత్వం అనేది సైడ్ బిజినెస్ టైపేనట. తన పూర్తి స్థాయి దృష్టి నటనపైనే అంటున్నాడు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదని, అప్పుడప్పుడూ సీరియస్, ఎమోషనల్, సెంటిమెంటల్ పాత్రలూ చేస్తేనే నటుడిగా గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చాడు. `జాతిరత్నాలు` రిజల్ట్ పై ప్రియదర్శి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. “ఈ సినిమా మొదలెట్టినప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. సిల్లీ కామెడీ ఇది. లాజిక్కులు లేవు కదా.. అని భయపడ్డాం. ఓ షెడ్యూల్ అవ్వగానే మాపై మాకు నమ్మకం కలిగింది. థియేటర్లో ప్రేక్షకుల నవ్వులు చూశాక… చాలా సంతోషం వేసింది. నా కెరీర్లో ఇది మరపురాని చిత్రం“ అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.