వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించింది. అందులో సందేహం లేదు. అయితే గెలిచిన తరవాత వారు చేసుకుంటున్న క్లెయిమ్లు వినిపిస్తునన వాదనలే ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. అమరావతి ఉద్యమం లేదని… మూడు రాజధానులకు ప్రజలు మద్దతు ప్రకటించారని.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన ఫలితాలను బట్టి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కాదు.. నేరుగా చెప్పకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలోనూ.. ప్రజల మద్దతు ఉందన్నట్లుగా పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. ఈ ఫలితాలతో… తమ విధానాలు కరక్టేనని వాదించడం ప్రారంభించారు.
కానీ స్థానిక ఎన్నికలు… స్థానిక ఎన్నికలుగానే జరిగాయి. వార్డు సమస్యలే ప్రజలకు కీలకం అయ్యాయి. రాష్ట్ర స్థాయి అంశాలను స్థానిక ఎన్నికల్లో తీర్పుగా ఓటర్లు పరిగణించలేదు. అధికార పార్టీకి ఓటేస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. తమకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు ఆగవని భావించారు. ఈ విషయంలో అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ వైసీపీకి బాగా ఉపయోగపడింది. అందులో సందేహం లేదు. కానీ.. ఇక్కడ ఇచ్చిన తీర్పును.. వైసీపీ తన విధానాల అమలు కోసం ఉపయోగించుకోవడమే… కాస్త ఎబ్బెట్టుగా ఉందనే వాదన ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
నిజంగా వైసీపీ తన విధానం కరెక్ట్ అయితే… రాజమార్గంలోనే వెళ్లాల్సి ఉంది. కానీ చాటుగా కార్యాలయాలను విశాఖకు తరలించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతగా… మూడు రాజధానులకు మద్దతు ఉందని నిరూపించాలంటే రిఫరెండంకు వెళ్లాలన్న డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. ప్రభుత్వం ఏది కావాలనుకుంటే అది చేయవచ్చు. పరిపాలన చేయడానికి రాజ్యాంగం ఐదేళ్లు గడువు ఇచ్చింది. అయితే రాజ్యాంగం ప్రకారం చేయాలి. అలా చేయడానికి ఉన్న మార్గాలతోనే తన విధానాలను అమలు చేయవచ్చు. వాటి ప్రాతిపదికనే ఎన్నికలకు వెళ్తే ప్రజలు తీర్పు ఇస్తారు. అదే అసలైన తీర్పు. స్థానిక ఎన్నికలు కాదు. ఈ విజయ గర్వంతో ఏమైనా చేస్తామంటే.. ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. చరిత్రలో జరిగింది ఇదే..!