తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అసెంబ్లీ ఎన్నికలంత హడావుడిగా సాగుతోంది. పలు చోట్ల ఘర్షణలు.. అనేక చోట్ల డబ్బుల పంపిణీ..అభ్యర్థులపై దాడులు.. ఇలా అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎలాంటివి చోటు చేసుకుంటాయో అన్నీ చేసుకున్నాయి. అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కారణం. ఓట్ల నమోదు దగ్గర్నుంచి ఓటింగ్ చేయించుకోవడం వరకూ అందరూ సీరియస్గా ఉండటంతో ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే పెరిగింది. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారో తెలియనుంది. అటు పార్టీలు పోటీలు పడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం, స్వతహాగా ఓటర్లు సైతం ఉత్సాహం చూపడంతో ఓటింగ్ శాతం పెరిగింది.
గెలవకపోతే… పరిస్థితులు మారిపోతాయన్నంద గట్టిగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నించారు. అది కూడా కొంత వరకూ నిజమే. టీఆర్ఎస్ రెండు ఎమ్మెల్సీలను గెలిస్తే… ఆ పార్టీకి ఇప్పటి వరకూ వచ్చి పడిన వ్యతిరేకత అంతా తగ్గిపోయేఅవకాశం ఉంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా.. టీఆర్ఎస్ పనైపోయిందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ హవా గాలి బుడగ అని ప్రచారం చేయవచ్చు. అందుకే టీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. బీజేపీ కూడా అంతే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.. తమది వాపు కాదని నిరూపించుకోవచ్చని భావిస్తున్నారు. త్వరలో జరగబోయే సాగర్ ఎన్నికలపైనా తమ గెలుపు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే… బీజేపీ నేతలుఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు.
అయితే ప్రధాన పార్టీలు .. తామంటే తాము అని పోటీ పడినా… హైదరాబాద్ స్థానంలో ప్రొ.నాగేశ్వర్, వరంగల్ స్థానంలో ప్రొ.కోదండరాం బలమైన పోటీ ఇచ్చారు. వీరిలో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు.. యువత… ప్రొఫెసర్లకే ఓట్లు వేశారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆయా పార్టీలకే ఓట్లు వేసి.. తమ ద్వితీయ ప్రాధాన్య ఓటుగా వీరికే అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వేరుగా ఉంటుంది. యాభై శాతం ఓట్లు వస్తేనే గెలిచినట్లు. లేకపోతే ద్వితీయప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. అదే జరిగితే.. వీరిద్దరి గెలుస్తారని.. ప్రధాన పార్టీలు ఓడిపోతాయని చెబుతున్నారు. అప్పుడు రెండు పార్టీలకూ షాక్ తగిలినట్లవుతుంది.