గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో ఘన విజయాలు వైసీపీ నేతలకు పట్ట పగ్గాల్లేకుండా చేస్తున్నాయి. జరిగింది మున్సిపల్ ఎన్నికలు అన్న విషయం తెలిసి కూడా… మూడు రాజదానులకు మద్దతుగా తీర్పిచ్చేశారని నిర్ణయించేస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని కించ పరిచేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇక రాజధాని ఉద్యమమే లేదని.. గుంటూరు, కృష్ణా ప్రజలు తీర్పిచ్చేశారని అంటున్నారు. అయితే అదే సమయంలో వారి వాదనపై కొన్ని మౌలికమైన సందేహాలు వస్తున్నాయి. వాటిలో అత్యంత కీలకమైనది.. విశాఖలో ఎన్నికల ఫలితాలు. మిగతా చోట్ల కంటే ఎక్కువ డివిజన్లు టీడీపీ అక్కడ గెల్చుకుంది. అంటే.. అక్కడి ప్రజలు విజయసాయిరెడ్డి, జగన్ బృందం తీసుకు రావాలనుకున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు వ్యతిరేకం అనా..?
విశాఖలో టీడీపీకి మెరుగైన ఫలితాలు..!
విశాఖలో ఎన్నికల ఫలితాలు టీడీపీకి కాస్త ఊపిరి సలపనిచ్చాయి. మిగతా చోట్ల.. ఎక్కడా పోటీ ఇవ్వకపోతే.. విశాఖలో మాత్రం… గట్టిపోటీ ఇచ్చారు. జనసేన భారీగా ఓట్లు చీల్చినప్పటికీ 30 కార్పొరేటర్ సీట్లను సాధించారు. వైసీపీ యాభై ఎనిమిది సాధించింది. ఇదేమంత గొప్ప విజయం కాదు. నిజానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన తర్వాత అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో వైసీపీకి పట్టం కడతారని.. టీడీపీ రెండు, మూడు డివిజన్లు కూడా గెల్చుకోలేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ పరిస్థితి అలా లేదు. ఇప్పుడు వైసీపీ నేతలు చేసిన ప్రచారం ప్రకారమే చూసినా టీడీపీ మెరుగైన ఫలితాలు వచ్చాయి. అవి రాష్ట్ర వ్యాప్త ట్రెండ్‌తో పోల్చినా ఎక్కువే. విజయనగరం లాంటి చోట్ల టీడీపీకి ఒక్క డివిజన్ రాకుండా గెలిచినా.. విశాఖలో మాత్రం…వైసీపీకి చెమటలు పట్టాయి. అసలు భీమిలీలోనే రాజధాని అని ఉదరగొడుతున్నా.. అక్కడ కీలకమైన డివిజన్లలో వైసీపీ ఓడిపోయింది.
విశాఖ ప్రజలకు వైసీపీ తెచ్చే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇష్టం లేదా..?
వైసీపీ నాయకులు విశ్లేషిస్తున్న ప్రకారం చూస్తే.. వైజాగ్ వాసులు… వైసీపీ నేతలు తీసుకొస్తామంమటున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. ఆ విషయం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉండి.. ఆ అధికారాన్ని 360 డిగ్రీల కోణంలో ఉపయోగించుకుని మరీ… వైజాగ్ ప్రజల ఓట్లు పొందలేకోయారంటే.. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. వైసీపీ నేతలు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించుకోవాల్సి ఉంది. నిజాయికీగా ఆ విశ్లేషణ చేస్తే.. అటు విజయవాడ, గుంటూరు ప్రజలు ఇచ్చినతీర్పు.. ఇటు విశాఖ ప్రజలు ఇచ్చినతీర్పు రెండింటికి అర్థాలు బోధపడే అవకాశం ఉంది.
ప్రజల తీర్పును టేకిట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే మొదటికే సమస్య రావొచ్చు..!
గుంటూరు, కృష్ణాల ప్రజలు మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారని.. తీర్మానించేస్తున్నప్పుడు.. విశాఖ తీర్పును కూడా అదే విధంగా విశ్లేషించడం చాలా ముఖ్యం. అక్కడ ఓ రకంగా.., విశాఖలో మరో రకంగా ప్రజల తీర్పును.. అన్వయించుకుని ముందుకెళ్లడం వల్ల.. రాజకీయంగా నష్టమే కానీ లాభం ఉండదు. స్థానిక ఎన్నికల ఫలితాలను చూసి… తమ విధానపరమైన నిర్ణయాలకు అదేఅంగీకారం అనుకుని స్వయం సర్టిఫికెట్ జారీ చేసుకుని ముందుకెళ్తే ఇబ్బందిపడే అవకాశం ఉంది. అలా కాకుండా.. మూడు రాజధానుల అంశమే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే హాట్ టాపిక్ అయితే…తాము నెత్తిన కిరీటం పెడతామనుకున్న ప్రజలే.. తమ కిరీటాన్ని తీసేసి పంపించేశారని తీరిగ్గా బాధపడాల్సి ఉంటుంది. ..