అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 40 శాతం ఓట్లను తెచ్చుకున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో మరింతగా దిగజారిపోయింది. ఎన్నికలు జరిగిన నగరాలు, పట్టణాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 30.73గా తేలింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో 39పైనే ఉంది. అంటే… దాదాపుగా తొమ్మిది శాతం ఓట్లను రెండేళ్లలో టీడీపీ కోల్పోయిందని అనుకోవచ్చు. అయితే.. ఇవి పట్టణాల ఓట్లే.. పల్లెల్లో ఓటింగ్ పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి అంచనా వేయలేం. కానీ టీడీపీ మాత్రం.. తన ఓటు బ్యాంక్‌ను కోల్పోతోందన్నది మాత్రం.. స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ తన ఓట్ల శాతాన్ని బాగా మెరుగుపర్చుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 52.63 ఓట్లు వైసీపీకి దక్కాయి. బిజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం ఓట్లు పొందాయి. నోటాకు 1.07 శాతంగా ఓట్లు పడ్డాయి. ఏపీలో మొత్తం ఐదు కోట్ల మంది వరకూ ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంది కేవలం.. 47 లక్షల 46వేల మంది మాత్రమే. చాలా చోట్ల ఏకగ్రీవం కావడంతో ఓట్లు నమోదు కాలేదు. ఈ కారణంగా విపక్షాల ఓట్లలో భారీగా కోత పడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ ఓటు షేర్ పెరిగింది. విపక్షాల ఓట్ల శాతం తగ్గింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వైసీపీ రిపీట్ చేసింది. ఇంకా చెప్పాలంటే రెండు శాతం అదనపు ఓట్లను సాధించింది. టీడీపీ ఓట్లకు భారీగా గండి పడింది. తొమ్మిది శాతం ఓట్లు కోల్పోయినా… వాటిని బీజేపీ- జనసేన అందుకోలేకపోయాయి. రెండు శాతం వైసీపీ పొందినా.. మిగతా ఎవరు పొందారన్నది ఆసక్తికరం. వైసీపీ రెబల్స్ పలు చోట్ల గెలిచారు. వారికి ఐదు శాతం ఓట్లు వచ్చాయి.