చిత్రపరిశ్రమలో తెలివైన నిర్మాతలలో బన్నీ వాస్ ఒకడు. తన సినిమాలన్నీ పక్కా ప్లానింగ్ తో సాగుతాయి. సక్సెస్ రేటు ఎక్కువ. ప్రమోషన్లలో కూడా తనదైన వైవిధ్యం ఉంటుంది. మెగా ఫ్యామిలీని నమ్ముకున్న వ్యక్తి. అల్లు అరవింద్ కి రైట్ హ్యాండ్! ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. కాకపోతే… బన్నీవాస్కి ఇప్పుడు కోపం వచ్చింది. ఓ నిర్మాత మీద, ఆయనకు సంబంధించిన పీఆర్వోల మీదా.. ఫైర్ అవుతున్నాడు. దానిక్కూడా బలమైన కారణం ఉంది. బన్నీవాస్ నుంచి వస్తున్న కొత్త సినిమా `చావు కబురు చల్లగా`. ఈ వారమే విడుదల అవుతోంది. అయితే… ఈ సినిమాకి ఓ రకమైన నెగిటీవ్ ప్రచారం మొదలెట్టారు కొంతమంది. `చావు కబురు చల్లగా విడుదలైన రెండు వారాలకే… ఓటీటీలో వచ్చేస్తుంది` అన్నది ఆ వార్తల సారాంశం. ఇదంతా మరో సినిమా నిర్మాత, పీఆర్వోటీమ్ పనిగట్టుకుని చేయిస్తున్న ప్రచారం అని బన్నీవాస్కి తెలిసింది.
ఓ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో చూడొచ్చంటే… థియేటర్లకు వెళ్లేదెవరు..? ఓటీటీలో చూసుకోవచ్చులే… అని లైట్ తీసుకుంటారు. దాంతో వసూళ్లు తగ్గిపోతాయి. ఆ స్థానంలో పక్కన ఆడుతున్న మరో సినిమాకి జనాలు వెళ్లిపోతారు. ఇదీ… కొంతమంది నిర్మాతల స్ట్రాటజీ. అదే బన్నీవాస్ కోపానికి కారణమైంది. “కోవిడ్ టైమ్లో ఓటీటీకి ఇవ్వమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ..మా సినిమా థియేటర్లలోనే చూపిద్దామనుకున్నాం. అందుకే ఆగాం. విడుదలైన తరవాత కూడా.. దాని రేంజ్ ని బట్టి నాలుగువారాలు ఆగాలా? ఆరు వారాలు ఆగాలా? అనేది నిర్ణయించుకుంటాం. రెండు వారాలకే ఓటీటీకి ఇవ్వాలన్న ఆలోచన మాకెప్పుడూ రాలేదు“ అంటూ బన్నీ వాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి వాతావరణం కాదని, ఆరోగ్యకరమైన పోటీ కాదని హితవు పలికారు. గతవారం బాక్సాఫీసు దగ్గరకు మూడు సినిమాలొచ్చాయి. అందులో రెండు సినిమాలకు ఒక్కరే పీఆర్వో. వాళ్లని ఉద్దేశించే.. బన్నీ వాస్ ఈ వ్యాఖ్యలు చేశాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో.. గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని వెబ్ సైట్లకు ముందే లీకులు ఇచ్చి… నెగిటీవ్ పబ్లిసిటీ మొదలెట్టారన్నది బన్నీ వాస్ ఆవేదన. నిజానికి ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా హర్షణీయం కానేకాదు. చిన్న చిన్న వార్తల వల్ల సినిమాల ఫలితాల్లో మార్పులు రావు గానీ, ఇండ్రస్ట్రీలో పక్కవాళ్లని కిందకు లాగేయాలి… అనే జాడ్యం ఎప్పటికైనా ప్రమాదకరం.