పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలన్నింటికీ హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. వాటిపై దర్యాప్తు జరపాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులను హైకోర్టు పక్కన పెట్టేసింది. ఈ మేరకు మంగళవారం కీలకమైన తీర్పు వెలువరించింది. పరిషత్ ఎన్నికల కొనసాగింపునకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ… అందులో… ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఆదేశించారు. బెదిరింపులు, దౌర్జన్యాల ద్వారా ఏకగ్రీవాలు చేసుకుని ఉంటే… మరోసారి నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పిస్తమన్నారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఎస్ఈసీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నామినేషన్లు దాఖలయినంత వరకూ.. ఎన్నికలు జరగనున్నాయి.
ఎస్ఈసీ రమేష్ కుమార్.. మూడు రోజులు సెలవుపై తమిళనాడుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన తదుపరి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు తీర్పు మేరకు… ఆయన ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆగిపోయిందో అక్కడ్నుంచి ప్రారంభించి… పూర్తి చేస్తారో లేదో అన్న ఉత్కంఠ ప్రారంభమయింది. ఆయన పదవీ కాలం నెలాఖరుతో ముగుస్తోంది. వివిధ కారణాల రీత్యా మొదట్లో ఆయన ప్రత్యక్షంగా చురుగ్గా ఎన్నికల ప్రక్రియ నిర్వహించినా.. తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ పట్ల అంత సుముఖంగా లేరని అంటున్నారు. ఇప్పుడు… పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినా… వచ్చే నెలలోనే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.
అప్పటికి తాను రిటైరవ్వాల్సి ఉంటుంది. తాను రిటైరన తర్వాత కూడా కొనసాగించేలా షెడ్యూల్ ఇవ్వడం సరి కాదని ఆయన ఆనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఒక వేళ… ఎస్ఈసీ సిద్ధపడకపోతే.. కొత్తగా ప్రభుత్వం నియమించబోయే… ఎస్ఈసీనే పరిషత్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పదే పదే సవరించింది. దాదాపుగా ప్రభుత్వం కోర్టుకు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది.