ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా దూసుకెళ్లిపోవడం ఇప్పుడు రాజకీయ మీడియా చానళ్లు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబుపై అమరావతి భూముల కేసులు నమోదు చేయగానే.. రెండు ప్రముఖ చానళ్లు స్పెషల్ కవరేజీ ప్రారంభించాయి. గతంలో రేవంత్ రెడ్డిని ఇంట్లో పెట్టి మూడు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ మూడు రోజుల పాటు… ఈ రెండు చానళ్లు… రూ. వెయ్యి కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లను బయట పెట్టాయి. అవన్నీ ఫేక్. ఆ విషయం తర్వాత తేలింది. కానీ ఆ తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే మీడియా వ్యూహన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నాయి.
అసలు ఈ కేసులో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అది మౌలికమైన ప్రశ్న. కానీ కొన్ని వందల మంది బాధితులు ఉన్నారన్నట్లుగా.. కథనాలు వండి వారుస్తున్నాయి. ఆభూముల్ని ఎవరు కొన్నారు.. ఎవరికి సన్నిహితులు అంటూ టేపులు పట్టి కొలిచినట్లుగా తేల్చి మరీ చెబుతున్నారు. ఈ మీడియా చానళ్ల హడావుడి చూస్తే.. కేసు సంగతి ఏమో కానీ ఆ పేరుతో విపరీతంగా కావాల్సినట్లుగా ప్రచారం చేయడానికి దీన్ని వాడుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఏ కేసులో అయినా బాధితుడు ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఆయన వద్దకు మూడు గ్రామాల అసైన్డ్ రైతులు మొర పెట్టుకున్నారని దీంతో ఆయన ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు సేకరించినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ వివరాల ఆధారంగానే కేసు నమోదు చేశానని చెబుతున్నారు.
అయితే.. ఆ మూడు గ్రామాల అసైన్డ్ రైతులే నేరుగా వెళ్లి సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. కేసులో పస ఉండేదిగా అనే డౌట్ మాత్రం ఈ టీవీ చానళ్లకు రాలేదు. నిజానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతి భూముల్లో జరిగిన ప్రతీ లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించింది. అక్కడ ఏమీ దొరికలేదేమో కానీ.. అమరావతి పరిధి దాటి… ఎక్కడో జరిగిన భూ లావాదేవీలను కూడా కేసుల పరిధిలో చేర్చారు. ఇప్పుడు కొత్తగా అసైన్డ్ భూములను బెదిరించి కొనుగోలు చేశారంటున్నారు. అసలు ఇందులో బాధితులే లేకపోతే.. ధర్డ్ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు ఎలా పెడతారన్న న్యాయనిపుణుల ప్రశ్నలు మాత్రం ఈ రెండు చానళ్లకు వినిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.