తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెంది సరిగ్గా ఆరు నెలలయింది. రాజ్యాంగం ప్రకారం… ఆరు నెలల్లో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీచేయాల్సి ఉంటుంది. లేకపోతే.. కనీసం షెడ్యూల్ అయినా విడుదల చేయాల్సి ఉంది. ఈ రోజుతో ఆరు నెలలు ముగిసిపోతాయి కాబట్టి… ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల ఇరవై మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఏప్రిల్ పదిహేడో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌తో పాటే… వీటి ఓట్ల లెక్కింపును చేపడతారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆయా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. తిరుపతి లోక్‌సభా నియోజకవర్గం .. రెండు జిల్లాల పరిధిలో ఉంటుంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ నుంచి పనబాక లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేశారు. వైసీపీ నుంచి జగన్ ఫిజియోధెరపిస్ట్ గురుమూర్తికి టిక్కెట్ అనధికారికంగా ఖరారయింది. బీజేపీ-జనసేన తరపున బీజేపీ .. ఓ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారిని నిలబెట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఈ లోక్‌సభ సీటును రెండు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెల్చుకుంది.
నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోమున నర్సింహయ్య.. అనారోగ్యంతో మృతి చెందారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఓ ఎన్నిక జరుగుతూ.. ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటోంది. తెలంగాణలో మొదట దుబ్బాక.. తర్వాత గ్రేటర్ ఎన్నికలు.. ఇప్పుడు నాగార్జున సాగర్ పోలింగ్ జరగనుంది .ఏపీలో నిన్నటి వరకూ పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికల హడావుడి నడిచింది. ఇక తిరుపతి ఉపఎన్నిక జరనగుంది. ఆతర్వాత పరిషత్ ఎన్నికలు.. సహకార ఎన్నికలు జరగనున్నాయి.