పరిషత్ ఎన్నికలు ఆరు రోజుల్లో పూర్తయిపోతాయని సీఎం జగన్ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులో వాదిస్తూంటారు. నిమ్మగడ్డే ఎన్నికలు నిర్వహించాలని.. ఆయనను అనరాని మాటలన్న మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్లు ప్రెస్మీట్లో దబాయిస్తూ ఉంటారు. ఇవన్నీ.. మంగళవారం చోటు చేసుకున్న ఘటనలు. ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తయిపోతాయని సీఎం జగన్ ఎలా అనుకున్నారో కానీ.. అంత వేగంగా అయిపోవాలని మాత్రం కోరుకుంటున్నారన్నది స్పష్టం. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణ వద్దని… ప్రభుత్వమే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. దానిపై విచారణ జరిపి హైకోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆయన ఇరవై రెండోతేదీ వరకూ సెలవుపై వెళ్తున్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. అప్పటివరకూ ఎన్నికల ప్రక్రియపై ముందుకెళ్లే అవకాశం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం… కళ్లు మూసి తెరిచేంతలో అయిపోవాలని.. అదీ కూడా నిమ్మగడ్డే నిర్వహించాలని కోరుకుంటోంది. ఎన్నికలు పెడితే నిమ్మగడ్డ రిటైర్మెంట్లోనే పూర్తి చేయవచ్చని కూడా సలహాలు ఇస్తున్నారు.
ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో జరపనే వద్దని తీవ్రంగా పోరాడిన ఏపీ సర్కార్.. ఇప్పుడు పూర్తిగా నిమ్మగడ్డ పనితీరుకు ఫిదా అయిపోయింది. మొదట్లో ఆయన నిర్ణయాలపై బూతులతో విరుచుకుపడినా.. తర్వాత గవర్నర్ జోక్యంతో పరిస్థితి మారిపోయింది. ఆయనను జైలుకు పంపుతామని అదే పనిగా హెచ్చరించి.. ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత గొడవలేం లేవని వాదిస్తోంది. మొత్తానికి తెర వెనుక ఏదో జరిగిందన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు గట్టిగానే కల్పిస్తున్నారు. కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం… వారు అనుకున్నట్లుగా నిమ్మగడ్డ నిర్వహిస్తారో లేదో మాత్రం క్లారిటీ లేదు.