ఎంపీలు ఏంచేస్తారు..? ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీలయినా కేంద్రాన్ని నిధులు అడుగుతారు. కేంద్రం నుంచి తమకు ఇన్ని నిధులు రావాల్సి ఉందని… ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు. కానీ ఇందుకు భిన్నంగా పార్లమెంట్లో రైల్వే మంత్రి ఏపీనే కేంద్రానికి రూ. పన్నెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని.. వాటిని ఇప్పించేందుకు చొరవ తీసుకోవాలని వైసీపీ ఎంపీలను కోరారు. ఆయన విజ్ఞప్తితో వైసీపీ ఎంపీలు బిత్తరపోయారు. ఇతర ఎంపీలు నవ్వుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే… పార్లమెంట్ రైల్వే బడ్జెట్‌పై చర్చ జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై వైసీపీ ఎంపీలు మాట్లాడారు. కేంద్రం ఏమీ చేయడం లేదన్నారు.
అయితే వైసీపీ ఎంపీలు లేవనెత్తిన ప్రాజెక్టులన్నీ… ఏపీ సర్కార్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులే. ఇదే విషయాన్ని గోయల్ గుర్తు చేసి… రూ. పన్నెండు వందల కోట్లు ఇలా చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఏపీ సర్కార్ చెల్లించాల్సి ఉందని.. వాటిని రైల్వేలకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు నోట మాట రాలేదు. ఏపీ సర్కార్ అనేక మంది కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది కానీ.. ఇలా… రైల్వేకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఆపేసిందని మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. ఇప్పుడు రైల్వే మంత్రి ఆ విషయాన్ని బయట పెట్టారు.
ఏపీలో రైల్వే ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే వంద శాతం తమ నిధులతోనే రాష్ట్రాల్లో పనులుచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకునే కొన్ని లైన్లు… కొన్ని సౌకర్యాల విషయంలో ఉమ్మడిగా నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వకపోతూండటంతో ఆ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఏపీ సర్కార్కే అవసరం లేనప్పుడు.. తమకు మాత్రం అంత ఇంట్రెస్ట్ ఏముందని కేంద్రం కూడా లైట్ తీసుకుంది. దీంతో రైల్వే అభివృద్ధి పనులు కూడా ఏపీలో అటకెక్కాయి.