రూ. 300 కోట్ల విరాళంతో తిరుపతిలో టీటీడీకి చిన్నపిల్లల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామని ముందుకు వచ్చిన ముంబై కంపెనీ వ్యవహారంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ కంపెనీ ఖాతాలో రూ. మూడు వందలు కూడా లేవని తేలింది. అలాంటి కంపెనీ ఎలా ఆస్పత్రి నిర్మాణం చేపడుతుందని… భక్తుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు సామర్థ్యం లేని కంపెనీని ఎలా నమ్మారని..ఎలా ఎంవోయూ చేసుకున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒప్పందం బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ టీటీడీ మాత్రం ఒప్పందం బయట పెట్టడం లేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. తెర వెనుక ఏం జరిగిందోనని చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి.
రూ. మూడు వందల కోట్ల విరాళం ఇస్తామన్న ఉద్వేగ్ ఇన్ఫ్రా అనే ముంబై కంపెనీలో కొత్తగా తెలుగువాళ్లు డైరక్టర్లుగా చేరారు. ఆ కంపెనీకి ప్రత్యేకంగా వ్యాపారం లేదు. మూలధనం లేదు. ఆదాయం లేదు. అలాంటప్పుడు.. మూడు వందల కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తామనడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందని.. ఇదంతా పెద్దలకు తెలిసే జరుగుతోందని టీటీడీ ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు… ఆస్పత్రి కోసం అంటూ ఇవ్వడానికి సిద్ధమైన పది ఎకరాల భూమిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ భూమిని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సహజంగా ఉద్వేగ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను టీటీడీ వెంటనే క్లారిఫై చేయాల్సి ఉంది.కానీ చేయడం లేదు. ఆ సంస్థకు విదేశాల నుంచి నిధులు వస్తాయని… కడతారని నమ్మకం వ్యక్తం చేస్తోంది. విరాళాలు వద్దనలేమని.. భక్తుల సెంటిమెంట్ అని కబుర్లు చెబుతోంది. ఇక్కడే ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా ఏర్పడుతోంది. అసలు ఆ సంస్థ ఏమిటి. … ఏ ఉద్దేశంతో రూ. మూడు వందల కోట్ల విరాళం ఇవ్వాలనుకుంది.. ఎంవోయూలో ఏముంది.. ఇవన్నీ బయటకు తేలితే కానీ.. అసలు లెక్కపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.