మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ చేస్తోంది.ఆయన నేరుగా సీఎల్పీకి వెళ్లిపోయి తనదైన శైలిలో చాలాచాలా మాట్లాడారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టికి ఆ మాటలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఎందుకంటే.. జేసీ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని సోనియా గాంధీని విమర్శిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ పెళ్లి గురించీ కామెంట్లు చేశారు. అంతే కాదు.. కాంగ్రెస్ పనైపోయిందని కూడా తేల్చారు. ఈ మాటలకు అక్కడే ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క.. ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. సోనియాను అన్నన్ని మాటలు అన్నా…. భట్టి ఏమీ మాట్లాడకపోవడం ఏమిటని ఇప్పుడు..కొంత మంది హైకమాండ్ విధేయులు… చిటపటలు ప్రారంభించారు. భట్టి విక్రమార్కపై ఫిర్యాదులకు రంగం సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పరిస్థితి తేడాగా ఉంది. పార్టీ అట్టడుగు స్థానానికి వెళ్లిపోతున్నా.. మిగిలిపోయిన నేతలందరూ.. తామంటే తాము పెద్ద అని పోట్లాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. సీఎల్పీ రేసులో తాను కూడా ఉన్నానని భట్టి .. హైకమాండ్‌కు సంకేతాలు పంపుతున్నారు. పాదయాత్రలు.. సైకిల్ యాత్రలు చేస్తున్నారు. మీడియా పట్టించుకోకపోయినా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన పని తాను చేస్తున్నానని… హైకమాండ్ కు నివేదికలు పంపి… గుడ్ విల్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అది మొత్తం జేసీ వల్ల కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అంతర్గతంగా ఏం జరిగినా … పెద్దగా బయటకురాదుకానీ.. మీడియా కెమెరాల ముందు జేసీ మాట్లాడటం… దాన్ని భట్టి పట్టించుకోకపోవడం.. ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అధికార పార్టీ చేసే తప్పుల కన్నా…తమ పార్టీ నేతల తప్పులనే ఎక్కువగా గుర్తించి ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకునే కాంగ్రెస్ నేతలకు కావాల్సింది ఇలాంటివే. అందుకే.. కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త పంచాయతీ ప్రారంభమైనట్లయింది. మొత్తానికి జేసీ పాత స్నేహితులను పలకరిద్దామని సీఎల్పీకి వెళ్లి.. మొత్తానికి అక్కడ చిచ్చు పెట్టేసి వచ్చారు.