మహాశివరాత్రికి ఒకేసారి మూడు సినిమాలు వచ్చాయి. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ – థియేటర్లో కొలువు తీరాయి. ఇందులో జాతిరత్నాలు సూపర్ హిట్ అయితే, శ్రీకారం యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. ఈవారం మరో మూడు సినిమాలు బాక్సాఫీసు దగ్గర తలపడుతున్నాయి. చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ మూడు సినిమాల్లో… చావు కబురు చల్లగాకే క్రేజ్ ఎక్కువ కనిపిస్తోంది. ప్రమోషన్లూ భారీగా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న సినిమా కావడంతో – బజ్ గట్టిగానే వినిపిస్తోంది.కార్తికేయ, లావణ్య త్రిపాఠీ జంటగా నటించారు. బస్తీ బాలరాజుగా కార్తికేయ, పెళ్లై భర్త కోల్పోయిన అమ్మాయిగా – లావణ్య కనిపించబోతున్నారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మిగిలిన సినిమాలతో పోలిస్తే, దీనికే ఓపెనింగ్స్ ఉండే ఛాన్సుంది. ఇక.. చాలా కాలం తరవాత విష్ణు `మోసగాళ్లు` చేశాడు. వైట్ కాలర్ మోసానికి సంబంధించిన కథ ఇది. కథపై చాలా కసరత్తు చేశామని, తన మార్కెట్ కి మించి ఈసినిమా కోసం ఖర్చుపెట్టామని అంటున్నాడు విష్ణు. క్రైమ్ థ్రిల్లర్లకు ఇప్పుడు మార్కెట్ బాగుంది. దాంతో పాటు కాజల్ లాంటి స్టార్ ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక ఈ వారం ముక్కోణపు పోటీలో నిలిచిన మరో సినిమా శశి. సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. శశి సినిమానే తనని ఆదుకోవాలి. `ఒకే ఒక లోకం నువ్వే` అనే సిద్ద్ శ్రీరాం పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట శశిలోనిదే. ఈ పాటే.. ఈ సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని చిత్రబృందం నమ్ముతోంది.ఓ పాట హిట్టయినంత మాత్రాన సరిపోదు. కథలో మేటర్ ఉండాలి. అది ఉంటే.. ఈ పాట మరింత ప్లస్ అవుతుంది. మొత్తానికి ఈవారం కూడా మూడు సినిమాలు పోటీలో నిలవడంతో.. థియేటర్లు కొత్త పోస్టర్లు, కటౌట్లతో కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది. గత వారం విడుదలైన.. జాతిరత్నాలు ఇంకా జోరు చూపిస్తున్న నేపథ్యంలో ఆ జోష్ ని మరపించడం ఈ మూడు సినిమాలపై ఉన్న మరో పెద్ద బాధ్యతగా మారింది.