తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంటే … ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక నేత. అనేక కీలకమైన కార్యక్రమాల్లో ఆయన భాగస్వామి. వైసీపీకి అనుకూలంగా ముద్రగడ తన ఉద్యమం ఉండేలా చేయగలిగారంటే దానికి కారణం భూమన అని చెబుతారు. అయితే ఇప్పుడు ఆ భూమనకు.. వైసీపీ నిరాదరణ ఎదురవుతోంది. ఎంత దారుణమైన నిరాదరణ అంటే… తన రాజకీయ వారసుడిగా భూమన అభినయ్ రెడ్డిని తీసుకొస్తున్న కరుణాకర్ రెడ్డికి…జగన్ గట్టి షాక్ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ పోస్టు కూడా ఇవ్వలేదు. తిరుపతి కార్పొరేషన్లో రిజర్వేషన్ పరంగా… భూమన అభినయ్ రెడ్డికి చాన్స్ లేదు. దాంతో డిప్యూటీ మేయర్ తీసుకుని చక్రం తిప్పుదామని అనుకున్నారు.
కానీ… జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ పోస్ట్ కూడా వేరే కార్పొరేటర్‌కు కేటాయించారు. చివరికి భూమనను .. బుజ్జగించడానికి అన్నట్లుగా… రెండో డిప్యూటీ మేయర్ పోస్టును తీసుకొస్తున్నాం…. ఆ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర పడగానే… రెండో డిప్యూటీ మేయర్ పోస్టు ఇస్తాం అని.. మీడియాకు లీకులు ఇచ్చారు. ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తేవాలనుకుంటే క్షణాల్లో పని. కానీ మంత్రుల సంతకాల్లేవని.. కేబినెట్ ఆమోదం ఉండాలని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి.. ఆర్డినెన్స్‌ను పంపలేకపోయారు. విచిత్రంగా పార్టీ నేతలను బుజ్జగించేందుకు.. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు వెళ్లిందని సంతకాలు కాగానే అందరికీ రెండో డిప్యూటీ మేయర్.. రెండో డిప్యూటీ చైర్మన్ ఇస్తామని ప్రచారం చేశారు. కానీ అది అసలు గవర్నర్ వద్దకే వెళ్లలేదు.
ఇవాళ… మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతమళ్లీ ఆర్డినెన్స్ తీసుకు వచ్చి పదవుల పందేరం చేయాలి. పార్టీ నేతల్ని కామ్ చేయడానికే … వైసీపీ హైకమండ్ ఈ రాజకీయం చేస్తోందన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పార్టీలో కొంత మంది బలమైన నేతల్ని వీలైనంతగా మినిమైజ్ చేయడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది.