తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠ నడుమ టీడీపీ సభ్యులు ఎవరైనా వైసీపీలోకి ఫిరాయిస్తారేమో అన్న చర్చల మధ్య సాగిన ఎన్నిక ప్రక్రియలో ఎవరూ ఏ పార్టీలోకి జంప్ కాలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతుతో గెలిచిన సీపీఐ, ఇండిపెండెంట్లు కూడా… జేసీకే మద్దతుగా నిలిచారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ అంతా సాఫీగా నడిచిపోయింది. తాడిపత్రిలో మూడు వేల మంది పోలీసుల్ని మోహరించడంతో ఏదో జరగబోతోందని అనుకున్నారు. ఓ ముస్లిం కుటుంబానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లను పార్టీలోకి రావడానికి వారి కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టడంతో పెద్ద తతంగమే నడుస్తోందని అనుకున్నారు. చివరికి… అంతా సాఫీగా నడిచిపోయింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో మున్సిపల్ చైర్మన్ గానే ఉండేవారు. జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉండేవారు. జేసీ ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పుడు.. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి టీడీపీ ఓడిపోక ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా పోటీ చేయలేదు. కుమారుడు పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తాను మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా మాట మేరకు పోటీ చేసి నిలబడి గెలిచారు. రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడిపోయినా తాడిపత్రిలో మాత్రం సైకిల్‌ను పరుగులు పెట్టించారు.
మిగతా అన్ని చోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సాఫీగా నడిచాయి. వైసీపీలో అంతర్గత విబేధాలు కొన్నిచోట్ల ఇబ్బందులు పెట్టాయి. విశాఖ మేయర్ స్థానం ఇస్తారని ఆశలు పెట్టుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌కు హైకమాండ్ హ్యాండిచ్చింది. ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సింది. చివరి క్షణంలో తప్పించారు. మేయర్ సీటు ఇస్తామని బుజ్జగించారు. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క కార్పొరేటర్‌కు పరిమితం చేశారు.