నర్సాపురం ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. నర్సాపురంలో అడుగు పెడితే అరెస్ట్ చేసేలా కేసులు నమోదు చేసిందని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా..ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. సొంతనియోజకవర్గానికి రానీయకుండా అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు వేశారని రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్లు హైకోర్టులో వాదించారు. కనీసం ఏ కేసులు పెట్టారో కూడా తనకు తెలియదని రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
స్పీకర్‌కు ప్రివిలే్జ్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ ఆ నోటీసులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించారు. అయినప్పటికీ… నర్సాపురం ఎంపీ హైకోర్టుకు వెళ్లి… అరెస్ట్ చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా మారినప్పటి నుండి నర్సాపురంలో రఘురామకృష్ణరాజు పర్యటించలేదు. అక్కడకు వెళ్తే దళిత సంఘాలతో ఆందోళనలు చేయించడానికి..దాడులు చేయించడానికి… ఆ ఘర్షణలను కారణంగా చెప్పి అరెస్ట్ చేయించడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నారని రఘురామరాజు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. ఆయన నర్సాపురంలో పర్యటించాలని ఆగిపోయారు.
అయితే ఆయన పర్యటనకు వచ్చారనుకున్నారేమో కానీ..కొంత మంది దళిత సంఘాల పేరుతో గో బ్యాక్ రఘురామరాజు అని నిరసనలు చేపట్టారు.దీంతో ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతోందని.. రఘురామరాజు ఆరోపిస్తున్నారు. వైసీపీ సర్కార్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని విచ్చలవిడిగా రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో తిరుగుబాటు చేసిన సొంత ఎంపీపైనా అదే చట్టం ప్రయోగించారని… రఘురామరాజు వర్గీయులు అంటున్నారు.