సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రాజకీయ కుట్ర ప్రేరేపితమని కొట్టి వేయాలని కోరుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన కేసు సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీని కోర్టు నుంచి తీసుకున్న టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు దానిపై న్యాయనిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి … అసలు బాధితులు, లాభపడిన వారెవరూ ఫిర్యాదు చేయకుండా ధర్డ్ పార్టీ వ్యక్తి ఫిర్యాదు చేయడం… వెంటనే కేసు నమోదు చేయడం కుట్రలో భాగం అని సులువుగా అర్థం చేసుకోవచ్చని… క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని సలహా ఇచ్చారు.
న్యాయనిపుణుల సలహా మేరకు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వెంటనే విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. అయితే.. రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అదే సమయంలో… చంద్రబాబు, నారాయణపై ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే .. సీఐడీ ఎదుట హాజరయ్యారు. తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించారు. తనకు దళితులు ఫిర్యాదులు చేశారని.. ఆ ఫిర్యాదులను సీఐడీకి అందచేశానని చెప్పుకొచ్చారు. అదే దళితులు నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేయవచ్చు కదా.. మీకే ఎందుకు ఫిర్యాదు చేశారన్న అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
మంగళగిరిలో 500 ఎకరాల అసైన్డ్ భూముల్లో మోసం జరిగిందని.. తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలాగే కొట్టేశారని అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నారాయణ తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. అసలు బాధితులు ఉన్నారో లేదో తెలినీ ఈ కేసు చట్ట ప్రకారం చెల్లదని టీడీపీ లీగల్ సెల్ కూడా చెబుతోంది. నిజంగా బాధితులు ఉంటే.. వారితోనే ఫిర్యాదు ఇప్పించేవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.