” ఇక ఎవరూ అమరావతి, స్టీల్ ప్లాంట్ ఉద్యమాల గురించి మాట్లాడకండి .. ఓట్లు అధికార పార్టీకి వేస్తారు… పోరాడేవారిని కించ పరుస్తారు..” అంటూ ఏపీ మున్సిపల్ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపించాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండ్స్ వస్తున్న సమయంలోనూ అదే తరహా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎవరూ ఉద్యోగాల భర్తీ గురించి .. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడవద్దని కామెంట్లు పెడుతున్నారు. దీనికి కారణం అక్కడా అధికార పార్టీ ఆధిక్యంలో ఉండటమే. రెండు సందర్భాల్లో ప్రజలు అధికార పార్టీపై విశ్వాసం ఉంచారు. అలా ఉంచడం తప్పన్నట్లుగా… ఓటర్ల తీర్పు… ఆ ఉద్యమాలకు వ్యతిరేకం అన్నట్లుగా తేల్చేయడం ఇక్కడ అసలు దారి తప్పిన రాజకీయం. సహనం లేని రాజకీయం.
అధికార పార్టీకే నైతిక బలం ఇచ్చిన ప్రజలు..!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించింది. ధన బలం కావొచ్చు… పోలీసు బలం కావొచ్చు… ఏదైనా కానీ.. అవన్నీ ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ కారణాలుగానే ఉంటాయి. గెలుపొక్కటే నిజం. ఇప్పుడు అదే కనిపిస్తోంది. అధికార పార్టీ ఎన్నికలు ఎలా నిర్వహించింది అన్నది చర్చనీయాంశం కాదు.. వచ్చిన ఫలితాలే చర్చనీయాంశం. ఇప్పుడు అదే జరుగుతోంది. అధికార పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. ఇతరులకు ఏ చిన్న చాన్స్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి తన టీమ్‌కు టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్‌ను చేధించడానికి వారు పరుగులు పెట్టారు. సాధించుకున్నారు. అది వారి అచీవ్ మెంట్. ఇంకా చెప్పాలంటే… ఏ మాత్రం కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చిన ఆది వైసీపీకి… ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే… అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి… ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. 151 సీట్లు గెల్చుకున్న పార్టీ … కొద్దిగా అయినా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అన్న ఫీలింగ్ వస్తే.. తర్వాత ఎన్నికల నాటికి అది … ఉబ్బిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా.. వైసీపీ వ్యూహకర్తలు జాగ్రత్త పడ్డారు. ఆ పార్టీ నేతలు శ్రమించారు. అది పూర్తిగా ఎన్నికల రాజకీయం. ప్రజాసమస్యలు హైలెట్ కానీ ఎన్నికలు.
ప్రజల ఓటు ప్రజా ఉద్యమాలకు ఎలా వ్యతిరేకం అవుతుంది..!?
ఏ ప్రభుత్వానికైనా ప్రజలు మద్దతుగానే ఉండాలని అనుకుంటారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికల్లో మాత్రం.. తమదైన మార్క్ చూపిస్తారు. ఇతర ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బలహీన పర్చాలని అనుకోరు. ఉపఎన్నికల్లో అధికార పార్టీలకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఇదే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది ఇదే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో… అధికార అహాన్ని దింపాలని అనుకున్నప్పుడు మాత్రమే దుబ్బాక లాంటి ఫలితాలు వస్తాయి. కానీ ఏపీలో ఇంకా ప్రభుత్వానికి అలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలని ప్రజలు అనుకోలేదు. అలాగని ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాలని అనుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన బలం మేరకు… పాలన చేయాలని… మరోసారి ఏపీ సీఎంకు… చాన్సిచ్చారు. కానీ ఈ ఫలితాలకు… ఏపీలో జరుగుతున్న ఉద్యమాలకు కొంత మంది ముడిపెట్టి… ప్రజల్ని .. ఓటర్లను విమర్శించే ప్రయత్నం చేయడమే… రాజకీయ అవగాహనా శూన్యతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓట్లు వేయరు కానీ.. ఉద్యమాలకు రోడ్ల మీదకు రావాలని డిమాండ్ చేస్తారంటూ… జనసేన ఫ్యాన్స్… ప్రజల్ని నిందించడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ అమరావతి పోరాటంలో… స్టీల్ ప్లాంట్ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలంటూ వస్తున్న డిమాండ్ల నేపధ్యంలో జనసైనికులు ఈ కామెంట్స్ చేశారు. నిజానికి పవన్ కల్యాణ్ ఇంత వరకూ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనలేదు. ఆయన పాల్గొని ఉంటే ప్రజల ఆలోచన మరోలా ఉండేదేమో. ఆయన షూటింగ్లో పాల్గొంటూ… వీడియోలు రిలీజ్ చేసి.. అదే ఉద్యమం అనుకుంటున్నారు. కనీసం.. విశాఖలో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు. అలాంటి నేత… ఎన్నికల్లో గెలిస్తే.. తమను వచ్చి ఉద్దరిస్తారని.. తమ వెనుక ఉండి ఉద్యమం చేస్తారని ఎవరైనా నమ్ముతారా..? నమ్మి ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధపడతారా..? ఎవరైనా కష్టపడిన తర్వాత ఫలితాన్ని ఆశిస్తారు. ప్రజలు కూడా.. రాజకీయ పార్టీల నేతల కష్టాన్ని చూసే ఓట్లు వేస్తారు. కుల, మతసమీకరణాలు ఎన్ని పని చేసినా… చివరికి పనితీరు ఆధారంగానే పట్టం కడతారు. ఆ విషయం తెలియకుండా… ఓటర్లను నిందిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు.
అలా అనుకుంటే.. ప్రజలకు మళ్లీ ..మళ్లీ ఓటు హక్కు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి..!
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచినంత మాత్రాన.. అమరావతి ఉద్యమాన్ని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని కించ పరచడం… రాజకీయంగా పరిపక్వత లేకపోవడమే. గుంటూరు, విజయవాడల్లో వైసీపీ గెలిస్తే.. వారు తమకు రాజధాని వద్దనుకుంటున్నారని ఎలా డిసైడ్ చేస్తారు..? విశాఖలో వైసీపీ గెలిస్తే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వారు మద్దతిచ్చినట్లా..?. ఇలాంటివాదలను ఎక్కువగా వైసీపీ నేతలు అంటే అధికార పార్టీ నేతలే చేస్తున్నారు. ఐదేళ్ల పాటు పరిపాలించే అధికారాన్ని ప్రజలు రెండేళ్ల కింటే జగన్ పార్టకి ఇచ్చారు. పరిపాలిస్తున్నారు. ఐదేళ్లలో ఆయన చేసిన పరిపాలన ఎలా ఉంది.. మళ్లీ చాన్సివ్వాలా లేదా అన్నదానిపై… తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పిస్తారు. అప్పటి వరకూ చట్ట ప్రకారం.. రాజ్యాంగ ప్రకారం.. ఆయన చేయాలనుకున్నది చేస్తారు. చట్ట వ్యతిరేకం.. రాజ్యాంగ వ్యతిరేకం అయితే… వాటిపై న్యాయస్థానాలు ఉన్నాయి. వాటి ద్వారా వ్యతిరేకమైన వాళ్లు పోరాటం చేయవచ్చు.. ఇప్పుడు అదే చేస్తున్నారు. రాజ్యాంగానికి.. చట్టానికి మించి ఏదో చేస్తామని అనుకుంటే… స్థానిక ఎన్నికల ఫలితాలే తమ చట్ట వ్యతిరేక నిర్ణయాలకు ఆమోద ముద్ర అనుకుంటే.. ఆ ఓటర్లే కర్రుకాల్చి వాత పెడతారు. చరిత్రలో జరిగింది ఇదే.
ఓటర్లు తప్పు చేయరు.. ఓటర్ ఇచ్చేదే ప్రజాతీర్పు..!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవా కనిపించింది. పట్టభద్రుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న ప్రచారం నడుమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అనేక రకాలుగా విపక్ష పార్టీల నేతలు ప్రచారం చేశారు. కానీ ప్రజలు… టీఆర్ఎస్కే పట్టం కట్టారు. దానికి కారణం… కేసీఆర్‌పై నమ్మకం ఉండటమే. ఆయనఉద్యోగాలిస్తాని.. హామీలు అమలు చేస్తారని నమ్మకం ఉండటమే. అంత మాత్రమానికి ఇక ఓటర్లను అవమానిస్తూ… ఉద్యోగాల గురించి మర్చిపోండని… టీఆర్ఎస్కు ఓటు వేయడం తప్పన్నట్లుగా కామెంట్లు చేయడం.. రాజకీయ దివాళాకోరు తనానికి నిదర్శనం.
రాజకీయాల్లో విజయాలు.. పరాజయాలు లీడర్ల చేతుల్లో ఉండవు. ఓ లీడర్ సిక్స్ ప్యాక్ చేసి.. రెండు వందల కేజీల బరువు ఎత్తితే ఆ గెలుపురాదు. ఆ గెలుపు ప్రజల చేతుల్లో ఉంటుంది. వారు ఓట్లేస్తేనే.. ఎవరైనా గెలుస్తారు. ఎవరు గెలిచినా అది ప్రజా విజయమే. అందుకే.. అటు అధికార పార్టీ కానీ.. ఇటు విపక్షాలు కానీ మిడిసి పడకూడదు. ప్రజా తీర్పును తక్కువ చేయకూడదు. అందరికీ జయాపజాలు ఎదురవుతూనే ఉంటాయి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఎవరైనా ఎగిరెగిరి పడితే.. అతి తాత్కలికమే.అందుకే.. ఉట్టి ఎన్నాళ్లూగుతది ఊగి ఊగి ఉన్నకాడ్కే వస్తదని పెద్దలు చెబుతూ ఉంటారు.