ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదాయపు పన్ను కట్టాల్సి వచ్చింది. ఆయన పన్ను కోసం రూ. ఏడు లక్షల పధ్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయనతో పాటు పేర్ని నాని అనే మరో మంత్రి కట్టాల్సిన ఆదాయపు పన్నును కూడా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నుంచి విడుదల చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదాయపు పన్నను ప్రజల పన్నులు రూపంలో కట్టిన సొమ్ము నుంచి ఎందుకు విడుదల చేయాలి.. ఆయన వ్యక్తిగతంగా చెల్లించుకోవచ్చు కదా..అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అయితే ఆయన సీఎం కాబట్టి.. సీఎంగా ఆయన ఆర్జించిన మొత్తానికి కూడా పన్నును ప్రజలే కట్టాలని అర్థం చేసుకోవాలి.
అయితే.. ఇక్కడ సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయంపై ఈ పన్ను మొత్తాన్ని కట్టలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ద్వారా వచ్చిన ఆదాయం పైనే… ప్రజల పన్నుల సొమ్ముతో… పన్ను కట్టడానికి చాన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నందున.. తనకు బయట వ్యాపారాల ద్వారా లభించిన ఆదాయానికి ప్రజల సొమ్ముతో పన్ను కట్టడానికి ఉండదు. ఒక వేళ అలా కట్టినట్లయితే అది తీవ్రమైన నేరం అవుతుంది. అలాంటి వాటికి ఏపీ అధికారులు పాల్పడకపోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ జీతభత్యాలు తీసుకుంటారు. అది ఆదాయపు పన్ను పరిమితికి మించి ఉంటే.. నిబంధనల ప్రకారం పన్ను కట్టాలి. ఆ మేరకు సీఎంజగన్కు నెలవారీ ఆదాయం… భత్యాలు కలిపి… వచ్చే దానిపై… ఏడాదికి రూ. ఏడు లక్షల పధ్నాలుగు వేల ఆదాయపు పన్ను అయి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్క సీఎం మాత్రమే కాదు..పేర్ని నాని పన్నులు కూడా ప్రజల సొమ్ముతోనే కట్టేశారు. ఇతర మంత్రులకూ అదే చాన్స్ ఇవ్వాల్సి రావొచ్చు. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు… యజమాని జీతం ఇస్తాడు. ఆ జీతం పన్ను పరిమితికి మించితే.. పన్నులను యజమాని భరించడం.. తన జీతంలోనుంచే ఉద్యోగి కట్టుకోవాలి. ఒక వేళ యజమాని భరిస్తే … ఆయన గొప్పోడు అని అంగీకరించాలి. కానీ ప్రజాధనం విషయంలో… మాత్రం ఆ గొప్పదనం వర్తించదు. ఇక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మునే జీతంగా తీసుకుంటున్నారు. అందులో నుంచే పన్ను కట్టుకోవాలి. మళ్లీ పన్నుల కోసం ప్రజాధనాన్ని ఉపయోగించుకోవడం నైతికత కాదు. అయినా… కొన్ని వందల కోట్ల ఆదాయం.. ఆస్తులున్న వారు.. ఇలా కొద్ది మొత్తానికి కూడా ప్రత్యేకంగా ఆదేశాలిచ్చి ప్రజల సంపద తీసుకోవడం ఏమిటో… అనేది చాలా మందికి సమాధానం దొరకని ప్రశ్న.